కొంతమంది దర్శకులు అంతే. మొండి ఘటాలు. ఎవరి మాటా వినరు. దర్శకుడు బుచ్చిబాబు కూడా అంతే. తీసింది రెండే రెండు సినిమాలు. కానీ.. తనకంటూ ఓ మార్క్ వేసుకొన్నాడు. ‘ఉప్పెన’ తో సూపర్ హిట్టు కొట్టిన బుచ్చి, ఇప్పుడు ‘పెద్ది’ తో మెగాఫ్యాన్స్ ని మరోసారి మెప్పించాడు.
‘పెద్ది’ విషయంలో బుచ్చి తీసుకొన్న నిర్ణయాలన్నీ సిక్సర్లే. దేవిశ్రీని కాదని రెహమాన్ ని టీమ్ లోకి తీసుకొన్నాడు. అది సిక్సర్. క్లైమాక్స్ విషయంలో కొంతమంది సందేహ పడినా, ధైర్యంగా ముందడుగు వేశాడు. ఆ ఐడియా కూడా సినిమాకు బాగా ఉపయోగపడింది.
రన్ టైమ్ విషయంలోనూ బుచ్చి చాలా పట్టుదలతో ఉన్నాడట. ఈ సినిమా నిడివి 3 గంటలకు పైమాటే. రిలీజ్ కు ముందు సుకుమార్ ఈ సినిమా చూశారు. ‘రన్ టైమ్ కాస్త తగ్గిస్తే బాగుంటుందేమో’ అని సలహా ఇచ్చార్ట. గురువు గారు చెప్పారు కదా అని బుచ్చి ట్రిమ్మింగ్ లోకి దిగిపోలేదు. ‘ఈ సినిమా ఇలానే ఉండాలండీ.. అప్పుడే బాగుంటుంది’ అని తనదైన స్టైల్ లో సుకుమార్ ని కూడా ఒప్పించగలిగాడు.
మొత్తానికి బుచ్చి తీసుకొన్న నిర్ణయాలు, వేసిన ఎత్తులు ఇవన్నీ ‘పెద్ది’ కి కలిసొచ్చాయి. దర్శకుడిగా తన ముద్ర చూఊపించుకొన్నాడు. ముచ్చటగా మూడో సినిమా ఎవరితో తీస్తాడు? అనే ఆసక్తి అయితే రేగుతోంది. మూడో సినిమా కూడా మైత్రీలోనే చేసే ఛాన్స్ ఉందని వినికిడి. బుచ్చి మైండ్ లో పెద్ద పెద్ద హీరోలే తిరుగుతున్నారు. చూడాలి.. ఏమవుతుందో?
