ఇక కేబుల్ కనెక్షన్‌కూ.. చానళ్ల వారీగా చార్జీలు..! 30వ తేదీ నుంచే అమలు..!!

ఖాళీ సమయంలో అలా టీవీ రిమోట్ పట్టుకుని… ఐదు సెకన్లకు ఒక చానల్ మార్చుకుంటూ పోవడం మీకు అలవాటా..? భాష తెలియకపోయినా.. ఏదో చానల్లో వచ్చే వింత దృశ్యాలు చూసి.. ఆనందించించడం ప్యాషనా..?. ఎప్పుడో ఓ సారి డిస్కవరీలో వచ్చే జంతువుల విశేషాలు చూసి ఆనందిస్తారా..? చానల్స్ సర్ఫింగ్‌లో ఏదో దేశంలో టూరిజం గురించి చెబుతూంటే… అబ్బుర పడతారా..? ఇక ఇవన్నీ… మీకు దొరకకపోవచ్చు. ఇలాంటి అనుభవాలు.. మీ టీవీ నుంచి మీకు కావాలంటే.. రూ. ఐదు వందలకుపైగా వదలించుకోవాలి… పైగా.. దీనికి జీఎస్టీ కూడా అదనం. ఈ నెల 29 అర్థరాత్రి నుంచి అంటే.. 30వ తేదీ నుంచి కేంద్రం… దేశంలోని ప్రతి ఒక్క కేబుల్ టీవీ వినియోగదారుడికి చుక్కలు చూపించబోతోంది.

సామాన్యునికి వినోదం అందించే కేబుల్ వ్యవస్థలో ధరలను క్రమబద్దీకరించడానికి కేంద్రం..కొత్త విధానం తెచ్చింది. దాని ప్రకారం.. ప్రతి చానల్‌ను .. ఆయా చానళ్లు, నెట్‌వర్క్‌లు నిర్ణయించిన ధరల ప్రకారం చందాదారుగా చేరాలి. అలా కావాల్సిన ప్రతీ చానల్‌ను ఎంపిక చేసుకోవాలి. కొన్ని పెయిడ్ చానళ్లు, కొన్ని ఫ్రీ టు ఎయిల్ చానల్స్ ఉన్నాయి. వీటి నుంచి కావాల్సినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్ని ఎంపిక చేసుకోవాలన్నదానిపై పరిమితి లేదు. కానీ ప్రతి దానికి విడిగా చార్జీ చెల్లించాలి.
ఇప్పుడు టీవీ పెడితే .. ఏ చానల్‌కు ఎంత ధరో.. పక్కన రేటు కనిపిస్తోంది. బ్రేకుల్లో మా చానల్ సబ్‌స్క్రయిబ్ చేసుకోండనే ప్రకటనలు వస్తున్నాయి. ఇదేమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ.. 30వ తేదీన మాత్రం.. అంతా మోడీ మాయ అని నిట్టూర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే… ఏయే చానళ్లు కావాలో.. నిర్ణయించుకోకపోతే..అసలు ఏమీ రాకుండా పోయే పరిస్థితి ఉందన్నమాట. ప్రస్తుతం కేబుల్‌ కనెక్షన్‌, డిష్‌యాంటీన్నా, ఫైబర్‌ నెట్‌ వంటి కనెక్షన్ల ద్వారా శాటిలైట్ చానళ్లు ప్రసారం అవుతున్నాయి. వీటికి ప్రాంతాల వారీగా.. సంస్థల వారీగా రూ. 150 నుంచి 250 వరకూ వసూలు చేస్తున్నారు. ఇందులో లెక్క పెట్టలేనన్ని చానళ్లు వస్తాయి. ఏది బాగుంటే అది చూసుకుంటాం. కానీ ఇప్పుడు రూల్ మార్చారు. ఏది చూడాలనుకుంటే.. వాటిని సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి. లేకపోతే ఆ చానళ్లు రావు.

దీంతోనే సరిపోదు.. ప్రతి చానల్‌కు డబ్బులు కట్టాలి. కేబుల్ కనెక్షన్ తీసుకున్నా.. చానల్‌కి ఇంత అని తప్పదు. ప్రశాంతంగా ఉన్న వ్యవస్థలోకి ఈ కల్లోలం ఎందుకంటే.., ప్రజల వినోదం నుంచి జీఎస్టీ పిండుకోవడానికి. ట్రాయ్ కొత్తగా తెచ్చి పెట్టిన విధానంతో… బిల్లులన్నీ ప్రిపెయిడ్ గా మారిపోయాయి. నూతన విధానం మేరకు కేబుల్‌చార్జీలు ముందుగానే చెల్లించి రీచార్జి చేసుకోవాలి. ఈ నెల 29 నుంచే వినియోగదారులు తాము చూడాల్సిన ఛానళ్ళను ఎంపిక చేసుకోవాలి. నాకు పే చానళ్లు అసలేమీ వద్దు.. ఫ్రీ చానల్స్ మాత్రమే ఎంపిక చేసుకుంటా.. అప్పుడు మొత్తం ఉచితమేగా.. అని అనుకున్నామనుకో.. మనకంటే.. పెద్ద అమాయకులు ఎవరూ ఉండరు…ఎందుకటే.. అంతకంటే పెద్ద తుగ్లక్ పైన ఉన్నారు. 100 ఉచిత ఛానళ్లు చూడాలంటే రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. … ఇంతే వదిలేస్తే.. ఆయన తుగ్లక్ ఎలా అవుతారు.. దీనికి జీఎస్టీ కూడా అదనం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.