తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఒక ఎత్తయితే, ప్రజల అంచనాలను అందుకోవడం ఇప్పుడు ఆయన ముందున్న అసలైన సవాలు. ద్రావిడ పార్టీల సుదీర్ఘ పాలనపై విసిగిపోయి, ఒక మార్పు కోసం విజయ్‌కు పట్టం కట్టిన తమిళ ప్రజలు.. ఇప్పుడు సాకులు వినడానికి సిద్ధంగా లేరు. రాజకీయం అంటే కేవలం ఓట్లు రాబట్టడమే కాదు, ప్రజల ఆశలను నిజం చేయడమని విజయ్ గుర్తించాలి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తొలిరోజే గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసింది అనే పాత పాట పాడుతుండటం సామాన్య ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఏ ప్రభుత్వమూ ఖజానా నింపి ఇవ్వదు..!
ఏ ప్రభుత్వానికైనా నెలాఖరుకు ఖజానా ఖాళీ అవుతుంది. ఓ సాధారణ ఉద్యోగికి వచ్చే జీతం ఎలా ఖర్చయిపోతుందో అలా ఆదాయం ఖర్చయిపోతుంది. ఎవరూ మిగులు పెట్టుకోరు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. ఇంకాఏమైనా అదనంగా పథకాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. గత ప్రభుత్వం అప్పులు చేసి పెట్టి పోయిందని ఇప్పుడు పథకాలు ఇవ్వలేనంటే ప్రజలు అంగీకరించరు.
ఫలితాలు చూపించాల్సిందే
ప్రజలు నాయకుడిని ఎన్నుకునేది ఫలితాల కోసమే తప్ప, గత పాలకుల వైఫల్యాలను ఏకరువు పెట్టడానికి కాదు. విజయ్ తన ప్రసంగాల్లో సాధ్యమయ్యే హామీలనే ఇస్తాను అని పదే పదే చెప్పారు. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాకులు చెబితే, అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. తమిళనాడు అప్పుల స్థాయిపై మాజీ సీఎం స్టాలిన్ ఇచ్చిన వివరణ చూస్తుంటే, బడ్జెట్ లెక్కలు బహిరంగంగానే ఉన్నాయి. ఇవన్నీ తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి, ఇప్పుడు ఖజానా ఖాళీ అనే కథలు చెబితే, అది తన అసమర్థతను దాచుకోవడానికి చేసే ప్రయత్నంగానే జనం భావిస్తారు.
విజయ్ సమర్థతకు పరీక్ష
కేవలం సంతకాలు చేయడం సులభమే కానీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలైన పరిపాలనా దక్షత. గత ప్రభుత్వాల కంటే మిన్నగా ఏదో చేస్తారని ఆశించి ఓట్లు వేసిన యువత , మహిళలు.. ఇప్పుడు విజయ్ నుంచి యాక్షన్ కోరుకుంటున్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతే, ద్రావిడ పార్టీలకు విజయ్ కు పెద్ద తేడా లేదనే అభిప్రాయం బలపడుతుంది. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు. ఒక కొత్త నాయకుడికి ప్రారంభంలో ఉండే ఉత్సాహం పాలనలోనూ కనిపించాలి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఏ ప్రభుత్వానికైనా సహజమే. కానీ వాటిని అధిగమించి సంక్షేమ పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్తారనేదే ముఖ్యం. లేకపోతే అద్భుతంగా గెలిపించిన ప్రజలే, రేపు అదే స్థాయిలో తిరస్కరించే అవకాశం కూడా ఉంటుందని మరువకూడదు.


