రివ్యూ – కేరాఫ్ సూర్య

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

తమిళ డబ్బింగ్ సినిమా వస్తోంది అంటే ఎదురు చూసే తెలుగు ప్రేక్షకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎందుకంటే వైవిధ్యమైన సబ్జెక్ట్ లు, కొత్త తరహా టేకింగ్ అక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది కాబట్టి. పైగా యువ హీరో సందీప్ కిషన్ తరచు వైవిధ్యమైన సినిమాలనే అందిస్తూ వస్తున్నాడు. ఈ రెండింటి కారణాలతో కేరాఫ్ సూర్య సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. మరి కేరాఫ్ సూర్య ఆ అంచనాలను అందుకుందా లేదా?

కథ :
సూర్య (సందీప్ కిషన్) తన తండ్రి (నాగినీడు)ను ఓ డాక్టర్ తప్పిదం కారణంగా కోల్పోతాడు. తల్లి (తులసి) చెల్లితో కలిసి బతికేస్తుంటాడు. అలాంటి టైమ్ లో అతని జీవితం ఓ మలుపు తిరుగుతుంది. సూర్య ప్రాణ స్నేహితుడిని, ఎవరో చంపాలని చూస్తుంటారు. సూర్య తన స్నేహితుడిని రక్షించుకోవాలని చూస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో సూర్యకు మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటీ? అప్పుడు సూర్య ఏం చేసాడు అన్నది మిగిలిన సినిమా.

విశ్లేషణ:
కేరాఫ్ సూర్య ఓ సినిమాగా చూస్తే,షార్ప్ గా బాగానే వుంటుంది. ఎక్కడా పెద్దగా అవసరం లేని సన్నివేశాలు కనిపించవు. పెద్దగా లోటు పాట్లు వుండవు. సినిమా ఎత్తుగడ కాస్త హడావుడిగా వున్నా, ఆ తరువాత సెటిల్డ్ గా సాగుతుంది. ఒకపక్క విలన్ విషయాలను థ్రిల్లింగ్ నోట్ తో ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తూనే, అదే సమయంలో హీరో క్యారెక్టర్ ను కూడా ఓ పద్దతి ప్రకారం ఎలివేట్ చేస్తూ వస్తాడు దర్శకుడు. హీరో, విలన్ క్యారెక్టర్లు ఎక్కడో అక్కడ ఢీకొనే పరిస్థతి వస్తుందని, అదే ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుందని ప్రేక్షకుడు ముందు నుంచీ ఊహిస్తూ వుంటూనే ఆసక్తిగా చూస్తూ వెళ్తాడు.

ద్వితీయార్థంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ మరీ అంత ఆసక్తిగా సాగదు. పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రను మరి కాస్త బాగా డిజైన్ చేసి వుండొచ్చు. అయితే హీరోను ఎలివేట్ చేయడం కోసం ఆ పాత్రను కాస్త తగ్గించినట్లు కనిపిస్తుంది. అదే విధంగా సినిమాలో కీలకమైన మెడికల్ సీట్ల వ్యాపారం, అనర్హత గలిగిన డాక్టర్లు లాంటి పాయింట్లను మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేసి వుండాల్సింది. దాని కోసం అవసరమైతే హీరో తల్లి వ్యవహారాలు లాంటివి తగ్గించుకోవచ్చు. అవేవీ మన ప్రేక్షకులకు అంతగా పట్టేవి కాదు కూడా. అసలు సినిమా లో కీలకమైన పాయింట్ కు, ఆరంభమైన నాగినీడు సీన్ తో సంబంధం వుంటుంది. కానీ దాన్నే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు.

ఇదిలావుంటే తమిళ ఆఫ్ బీట్ సినిమాలతో, మిడిల్ రేంజ్ థ్రిల్లర్లతో ఓ సమస్య వుంటుంది. అవి పూర్తిగా లోకల్ నేటివిటీతో, నేలబారుగా వుంటాయి. మన వాళ్లకు సినిమా అంటే కాస్త కలర్ ఫుల్ గా వుండాలి. మరీ గ్లామర్ నింపేయకపోయినా, తెర మీద చూడ్డానికి ఆహ్లాదంగా వుండాలి. అందుకే విలన్ లను సైతం కాస్త అందంగా, స్టయిల్ గా వుండేవాళ్లను తెచ్చుకుంటారు మనవాళ్లు. ఈ లైన్ తో చూసుకుంటే కేరాఫ్ సూర్య కు ఎక్కువ మార్కులు పడవు. పైగా ఇలాంటి లైన్ కథలు, ఇదే తరహా మొహాలు, ఇవే తరహా సీన్లు చాలా తమిళ డబ్బింగ్ సినిమాల్లో చూసేసి వుంటావేమో? కొత్తదనం అన్న ఫీల్ కలుగదు. తమిళ రౌడీ గ్యాంగ్ మొహాలు మన ప్రేక్షకులు అంతగా చూడలేరు. ఆ సమస్య ఈ సినిమాలో కూడా వుంది.

మొత్తం మీద చూసుకుంటే, అంతా బాగానే వున్నట్లు వుంటుంది కానీ, ఎక్కడో ఏదో అసంతృప్తి వుంటుంది. అదే మన నేటివిటీకి, మన ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేకపోవడం. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు చాలా చూసేయడం.

నటీనటులు :

సందీప్ కిషన్ మంచి నటుడే.కానీ అతనికి వచ్చే పాత్రలన్నీ మూడాఫ్ అయినట్లో, లేదా కాస్త డల్ నోట్ తో వున్నట్లుగా వుండేవో వస్తున్నాయి. దాంతో అతన్ని కొత్త పాత్రలో చూసినట్లు వుండదు. అయినా అతను చాలా నాచురల్ గా చేస్తూ వస్తున్నాడు కాబట్టి, అతని నటన ఓకె. మెహరీన్ పాత్రనే చిన్నది అనుకుంటే, అందులోనే ఆమె హావభావాలు చూడలేం. మిగిలిన వాళ్లంతా ఓకె.

సాంకేతికవర్గం :

నేపథ్య సంగీతం బాగుంది. మొదలవుతోందా..అన్న పాట కొన్నాళ్లు వినిపిస్తుంది. మాంచి మెలోడీ వుంది ఆ పాటలో. సినిమాటోగ్రఫీలో అద్భుతాలేమీ కనిపించవు. సహజంగా వుంటుందంతే. మాటల్లో మెరుపులు తక్కువే. దర్శకుడు సుశీంద్రన్ టేకింగ్ స్టయిల్, ఈ తరహా తమిళ థ్రిల్లర్లు నచ్చేవారిని మాత్రం ఈ సినిమా కాస్త ఆకట్టుకుంటుంది.

తీర్పు :

ఇదే కథ, ఇదే డైరక్షన్, ఇదే సీన్లు, కానీ కాస్త కలర్ ఫుల్ గా, కాస్త మనవాళ్లకు పరిచయం వున్న నటులతో తీస్తే వేరుగా వుంటుంది. సినిమా స్టయిల్ మార్చనక్కరలేదు. టేకింగ్ మార్చనక్కరలేదు. గోడకు సున్నం వేసిన దానికీ, రాయల్ ఎమల్షన్ వేసిన దానికి తేడా వుంటుందిగా.

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.