సుబ్బ‌రామిరెడ్డి ద‌గ్గ‌ర ఉన్న మ్యాజిక్ ఏమిటో..?

ప్రైవేటు వ్య‌క్తులు, సంస్థ‌లు ఇచ్చే అవార్డు వేడుక‌లు చూడండి. వాళ్లంతా చాలా మందికి అవార్డులు ఇస్తారు. కానీ అందుకోవ‌డానికి అందులో స‌గం మంది కూడా రారు. కేవ‌లం పేరుకి మాత్ర‌మే అవార్డులు. వాళ్ల పేరు మీద మ‌రొక‌రు వేదిక‌పై ఆ పుర‌స్కారాల్ని అందుకుంటారు. ఓ అవార్డు ఫంక్ష‌న్‌కి ఓ స్టార్‌ని తీసుకురావ‌డం గ‌గ‌నం అయిపోతుంటుంది. కానీ సుబ్బ‌రామిరెడ్డి ఫంక్ష‌న్లు మాత్రం భిన్నంగా జ‌రుగుతుంటాయి. ఇంటింటికీ ఓ అవార్డు.. అన్న‌ట్టు – చిత్ర‌సీమ‌లోని ప్ర‌తీ కుటుంబానికీ ఓ అవార్డు ఇస్తుంటారాయ‌న‌. అందుకోవ‌డానికి హీరోలూ వ‌చ్చేస్తుంటారు. టీఎస్ఆర్ అవార్డు వేడుక ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. దాదాపు 15 మంది హీరోలు 20 మంది హీరోయిన్లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు.. ఇలా స్టార్లంతా ఒకే వేదిక‌పై క‌నిపించారు. క‌థానాయిక‌ల‌కైతే లెక్కేలేదు. సౌత్ ఇండియాలోని హీరోయిన్లంతా ద‌ర్శ‌న‌మిచ్చారు. బాలీవుడ్ నుంచి విద్యాబాల‌న్‌, బోనీక‌పూర్‌లు సైతం వ‌చ్చారు. ఏ అవార్డూ ఫంక్ష‌న్‌లోనూ ఇలా గుంపులు గుంపులుగా హీరోలు క‌నిపించ‌రు. పైగా ఈ కార్య‌క్ర‌మానికి మేం అతిథిగా వ‌చ్చాం.. అన్న ఫీలింగ్ హీరోల్లో ఉండ‌దు. అవార్డు కార్య‌క్ర‌మం అయ్యేంత వ‌ర‌కూ హీరోలంతా సుబ్బరామిరెడ్డితో పాటు వేదిక‌పై ఉన్నారు. వేదిక అంతా ర‌సాభ‌స‌గా మారినా.. ఎవ్వ‌రూ కిక్కురుమ‌న‌రు. ఏ ఫంక్ష‌న్‌లోనూ ఇలాంటి చిత్ర విచిత్రాలు జ‌ర‌గ‌వు. సుబ్బ‌రామిరెడ్డికి మాత్ర‌మే ఎందుకు సాధ్య‌మైంది. ఆయ‌న అవార్డు ఇస్తానంటే.. అంద‌రూ ఇలా ఎందుకు క్యూ క‌డుతున్నారు..??

ఇదంతా సుబ్బ‌రామిరెడ్డి మాయ‌. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా ఆప్తుడు. ఎవ‌రికి ఏ ప‌ని కావాల‌న్నా… చేసి పెడ‌తాడు. ఢిల్లీ స్థాయిలో ఆయ‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి, స్టార్స్‌ని ఆదుకున్న సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. కొంత‌మంది హీరోల‌కు ప‌ద్మ అవార్డులు రావ‌డంలో సుబ్బ‌రామిరెడ్డి పాత్ర చాలా ఉంది. అందుకే సుబ్బ‌రామిరెడ్డి ఏ ఫంక్ష‌న్‌కి పిలిచినా, ఎలాంటి అవార్డు కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా హాజ‌రు ఈ స్థాయిలో ఉంటుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com