ఏపీ క‌మ‌ల‌నాథుల విష‌యంలో మౌనం అందుకేనా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్షం భాజ‌పా మ‌ధ్య రోజురోజుకీ దూరం పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో అంశాలవారీగా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన సోము వీర్రాజు, పురందేశ్వ‌రి వంటి నేత‌లు.. ఇప్పుడు నేరుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు చేస్తూండ‌టం చూస్తున్నాం. టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే తాము న‌ష్ట‌పోతున్నామ‌ని అనేస్తున్నారు. అయితే, ఇంత జ‌రుగుతున్నా కేంద్ర నాయ‌క‌త్వం ఎందుకు జోక్యం చేసుకోవ‌డం లేదు..? ఏపీ భాజ‌పా నేత‌లు ఈ స్థాయిలో స్పందిస్తుంటే అధినాయ‌క‌త్వానికి తెలీదా, వారి అనుమతి ఉందా..? లేదా, ఇక్క‌డ జ‌రుగుతున్నది తెలిసి, ఉద్దేశ‌పూర్వ‌కంగానే మౌనంగా ఉంటున్నారా..? మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపై విమ‌ర్శ‌లు త‌గ్గించాల‌ని రాష్ట్ర నేత‌ల‌ను ఎవ్వ‌రూ వారించ‌డం లేదా..? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు తాజా ప‌రిస్థితి ఆస్కారం ఇస్తోంది.

ఏపీ భాజ‌పా నేత‌లు స్వ‌రం పెంచ‌డం వెన‌క త‌మ ఉనికిని చాటుకునే కోణం ఉంద‌నే ఒక అభిప్రాయం ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. ఆంధ్రా భాజ‌పా నేత‌ల్ని కేంద్ర నాయ‌క‌త్వం మొద‌ట్నుంచీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నీ, నామినేటెడ్ ప‌ద‌వుల వంటి విష‌యంలో ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తి ఏపీ నేత‌ల్లో ఉంది. అయితే, దీన్ని నేరుగా వ్య‌క్తం చేయ‌లేక… ఇలా మిత్ర‌ప‌క్షంతో దూరం పెంచే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల త‌మ ప్రాధాన్య‌త‌ను అధినాయ‌క‌త్వం గుర్తిస్తుంది అనే వ్యూహంతో ఏపీ నేత‌లు ఉన్నార‌నే క‌థనాలు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయం అవుతున్నాయి.

ఇక‌, ఆంధ్రాలో ఇంత జ‌రుగుతున్నా జాతీయ నాయ‌క‌త్వం స్పందించ‌క‌పోవ‌డం వెన‌క కూడా వారి లెక్క‌లు వారికి ఉన్న‌ట్టు కూడా కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకిగానీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకిగానీ ఆంధ్రాలో ప‌రిస్థితి ఏంటో స్ప‌ష్టంగా తెలుసు. అంతేకాదు.. కేంద్ర ప‌థ‌కాల‌కు, కేటాయింపుల‌కు త‌మ‌కు ద‌క్కాల్సిన ప్ర‌చారం చంద్ర‌బాబు ద‌క్క‌నీయ‌కుండా చేస్తున్నార‌న్న అభిప్రాయం వారికి లోలోప లేకుండా ఎలా ఉంటుంది చెప్పండీ..! టీడీపీ విష‌యంలో కేంద్రం మైండ్ సెట్ ఎలా ఉందనేది చాలా అంశాల్లో స్ప‌ష్ట‌మౌతూనే ఉంది. అయితే, అలాగ‌ని ఉన్న‌ప‌ళంగా జాతీయ నాయ‌క‌త్వం కూడా టీడీపీపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌లేదు క‌దా! ఎందుకంటే, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో టీడీపీతో పొత్తు కొన‌సాగించాల్సిన అవ‌స‌రమే ఇప్ప‌టికీ క‌నిపిస్తోంది.

అలా అయితే, రాష్ట్ర నేత‌ల దూకుడును వారించొచ్చు కదా అనొచ్చు! కానీ, ఆంధ్రా భాజ‌పా నేత‌ల్ని పిలిచి.. టీడీపీని ఏమీ అనొద్ద‌ని ఇప్పుడే చెబితే.. రాష్ట్ర నేత‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు ఎవ‌రో నిర్ణ‌యించ‌లేదు. ఆ విషయాన్ని పక్కనపడేశారు. దీంతో హ‌రిబాబు కూడా ఈ మ‌ధ్య కొంత మౌనంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ నేత‌ల‌కు క్లాస్ తీసుకోవ‌డం లాంటివి చేస్తే ప‌రిస్థితి మ‌రోర‌కంగా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, కొన్నాళ్ల‌పాటు ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తూ… ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాక అప్ప‌టి ప‌రిస్థితిని అంచ‌నా వేసి ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే ఆలోచనలో కేంద్ర నాయ‌క‌త్వం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.