హ‌జ్ యాత్ర స‌బ్సిడీ ర‌ద్దు ఆ త‌ర‌హా నిర్ణ‌య‌మేనా..?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు మ‌రో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌నే చెప్పాలి! ప్ర‌తీయేటా హ‌జ్ వెళ్లే ముస్లిం యాత్రికుల‌కు కేంద్రం ఇస్తున్న సబ్సిడీని ఇక‌పై తీసేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నిజానికి, దేశానికి స్వ‌తంత్రం వచ్చిన ద‌గ్గ‌ర నుంచీ హ‌జ్ యాత్రికుల‌కు స‌బ్సిడీలు ఇవ్వ‌డం ఉంది. ఈ ఏడాది నుంచీ హ‌జ్ వెళ్లేవారికి స‌బ్సిడీ ఉండ‌దు. అంతేకాదు, మ‌గ‌వారి తోడు లేకుండా న‌లుగురు ముస్లిం మ‌హిళ‌లు క‌లిసి హ‌జ్ యాత్ర‌కు వెళ్లే వీలు క‌ల్పిస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. స‌బ్సిడీ ర‌ద్దు విష‌య‌మై 2012లోనే సుప్రీం కోర్టు కొన్ని సూచ‌న‌లు చేసింది. ద‌శ‌ల‌వారీగా 2022లోపు త‌గ్గించుకోవ‌చ్చని చెప్పింది. అయితే, దీన్ని హుటాహుటిన మోడీ స‌ర్కారు ఇప్పుడే అమ‌లు చేస్తుండ‌టంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇది ముస్లింల‌కు మేలు చేసే చ‌ర్య‌గానే ప్ర‌భుత్వం అభివ‌ర్ణిస్తోంది. ప్ర‌తీయేటా సబ్సిడీకి కేటాయిస్తున్న సొమ్మును ఇక‌పై ముస్లిం బాలిక‌ల విద్యాభివృద్ధికి ఖ‌ర్చు చేస్తామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ముస్లింల‌కు ఎలాంటి న‌ష్ట‌మూ లేద‌నీ, ఎయిర్ ఇండియాతోపాటు కొంత‌మంది ద‌ళారుల‌కు మాత్ర‌మే న‌ష్ట‌మ‌ని చెబుతున్నారు. ముస్లింలు స్వ‌శ‌క్తితో ఎద‌గాల‌నీ, వారి సొంత సంపాద‌న‌తోనే హ‌జ్ యాత్ర‌కు వెళ్లాల‌నేదాన్ని త‌మ‌దైన శైలిలో భాజ‌పా నేత‌లు ఇప్పుడు చెబుతున్నారు. అయితే, ఈ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ కొంత త‌ప్పుబ‌డుతోంది. హ‌జ్ యాత్ర‌కు ద‌ర‌ఖాస్తులు తీసుకోక‌ముందే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌నీ, ఓ ప‌క్క హ‌జ్ యాత్ర‌కు ఏర్పాట్లు జ‌రిగిపోతున్న త‌రుణంలో ఇలాంటి నిర్ణ‌యం కొంత గంద‌ర‌గోళానికి గురిచేస్తుంద‌ని మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ అన్నారు. అంతేకాదు, ఇజ్రాయిల్ ప్ర‌ధానిని ఆక‌ర్షించ‌డం కోస‌మే మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆరోపించారు.

అయితే, ఈ నిర్ణ‌యం వెన‌క భాజ‌పా ఆశిస్తున్న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం వేరుగా ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు చేయ‌డం ద్వారా ఇప్ప‌టికే ముస్లిం మ‌హిళ‌ల‌కు భాజ‌పా బాగా ఆక‌ర్షించింద‌నే అభిప్రాయం ఈ మ‌ధ్య వ్య‌క్త‌మౌతోంది. ఇప్పుడు ఈ నిర్ణ‌యం వెన‌క కూడా ముస్లిం మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించ‌డం అనే కోణం ఉంద‌నే చెప్పుకోవ‌చ్చు. మ‌హిళ‌లు హ‌జ్ కు వెళ్లాలంటే మ‌గతోడు త‌ప్ప‌నిస‌రి. కానీ, ఇక‌పై ఓ న‌లుగురు మ‌హిళ‌లు క‌లిసి వెళ్లొచ్చు. ఇంకా, హ‌జ్ యాత్ర‌కు ర‌ద్దు చేసిన స‌బ్సిడీని కూడా ముస్లిం బాలిక ఉన్న‌తికే ఖ‌ర్చు చేస్తామ‌ని కూడా ప్ర‌భుత్వం చెబుతోంది. ముస్లిం మ‌హిళ‌ల ఓటు బ్యాంకును భాజ‌పా ప్ర‌ధానంగా ల‌క్షించింద‌నీ, ట్రిపుల్ త‌లాక్ త‌రువాత వారిని ఈ తాజా నిర్ణ‌యం ద్వారా మ‌రింత ఆక‌ర్షించ‌డం అనేదే భాజ‌పా ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.