దేశవ్యాప్తంగా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారుల హక్కులను కాపాడేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదేశాలను జారీ చేసింది. ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేసే డెవలపర్లు, నిధులను దారిమళ్లించే బిల్డర్ల ధోరణికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించారు.
గడువు దాటితే బిల్డర్లకు భారీ జరిమానాలు!
ప్రాజెక్ట్ ప్రారంభంలో ప్రకటించిన గడువు ముగిసిన తర్వాత కూడా నిర్మాణాలను పూర్తి చేయని డెవలపర్లపై ఇకపై కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ఒప్పందం ప్రకారం ఇళ్లను అప్పగించడంలో ఆలస్యమైతే బిల్డర్లపై భారీగా ఆర్థిక జరిమానాలు విధించాలని కేంద్రం స్పష్టం చేసింది. అవసరమైతే సదరు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం లేదా నిలిపివేయడం వంటి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాల ‘రెరా’ అథారిటీలను ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి పనులు సాగుతూ, సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న సాధారణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
బ్యాంక్ రుణాల దారిమళ్లింపునకు చెక్
ఈ సరికొత్త ఆదేశాల్లో అత్యంత కీలకమైన అంశం బిల్డర్లు పొందే బ్యాంక్ రుణాలు మరియు నిధుల నిర్వహణ. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణాలను లేదా కొనుగోలుదారుల నుండి సేకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు లేదా సొంత వ్యాపారాలకు దారిమళ్లిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీనిని నివారించడానికి, బిల్డర్లు పొందే ప్రతి బ్యాంక్ రుణాన్ని కేవలం సదరు ప్రాజెక్ట్ నిర్మాణానికే వాడేలా ‘ఎస్క్రో అకౌంట్’ నిబంధనలను మరింత కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. కొనుగోలుదారుల నుండి వచ్చే నిధుల్లో 70 శాతాన్ని ఈ ప్రత్యేక ఖాతాలోనే ఉంచాలని, దీనిపై బ్యాంకులు గానీ, లెండర్లు గానీ ఎలాంటి లీన్ లేదా థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
మూడంచెల ధృవీకరణతోనే విత్‌డ్రాయల్స్.. పెరగనున్న నమ్మకం!
ఈ ఎస్క్రో ఖాతా నుండి బిల్డర్లు తమకు నచ్చినట్లుగా నిధులను డ్రా చేయడానికి వీల్లేదు. ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతికి అనుగుణంగా మాత్రమే నిధులను ఉపసంహరించుకోవాలి. ఈ విత్‌డ్రాయల్స్ కోసం చార్టర్డ్ అకౌంటెంట్ , ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల ద్వారా మూడంచెల ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి చేశారు. కేంద్రం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ పెరగడమే కాకుండా, అసంపూర్తిగా నిలిచిపోయే ప్రాజెక్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, మార్కెట్లో కొనుగోలుదారుల నమ్మకం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
