చ‌ల‌ప‌తి బాబాయ్‌.. అది నోరేనా… చూసుకో!!

చిన్నా, పెద్దా తేడా లేకుండా.. అంద‌రూ `బాబాయ్` అని పిలుస్తున్నారంటే ఆ మ‌నిషికి ఎంత మ‌ర్యాద ఇస్తున్నారో అర్థం చేసుకోవొచ్చు. మ‌రి ఆ పెద్ద‌రికం చ‌ల‌ప‌తిరావ్ నిలుపుకొంటున్నాడా?? త‌న మ‌ర్యాద కాపాడుకోగ‌లుగుతున్నాడా?? అంటే లేద‌నే చెప్పాలి. ఆడియో ఫంక్ష‌న్ల‌లో చ‌ల‌ప‌తిరావుకి మైకు ఇవ్వాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఏం అడిగినా… ఓ బూతు వ‌దులుతూ భ‌య‌పెడుతున్నాడు. తాజాగా .. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియోఫంక్ష‌న్లోనూ బాబాయ్ బూతు పురాణం ఆగ‌లేదు. ‘అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రమా’ అని బాబాయ్‌ని అడిగితే… `అమ్మాయిలు హానిక‌రం కాదు గానీ.. ప‌క్క‌లోకి ప‌నికొస్తారు` అనేశాడు. దాంతో అక్క‌డున్నవాళ్లంతా అవాక్క‌య్యారు. చ‌ల‌ప‌తిరావుకి మైకు ఇచ్చిన పాపానికి యాంక‌ర్ భామ‌కు న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాలేదు.

అమ్మాయిల‌పై చ‌ల‌ప‌తిరావుకి మ‌రీ ఇంత చీప్ అభిప్రాయం ఉందా?? మ‌రీ ఇంత నీచంగా ఎలా మాట్లాడ‌గ‌లుగుతున్నాడు?? జ‌నాలు చూస్తున్నార‌న్న ఇంగితం కూడా లేక‌పోతే ఎలా? ఇదే పోగ్రాం లైవ్‌లో చ‌ల‌ప‌తిరావు ఇంట్లో వాళ్లూ చూస్తారే, వాళ్లింట్లోనూ అమ్మాయిలు ఉండే ఉంటారే.. వాళ్ల ముందూ ఆయ‌న ఇలానే మాట్లాడ‌తాడా?? పెద్ద‌రికం వ‌య‌సులో ఉండ‌దు. హోదాలో ఉండ‌దు. అనుభ‌వంలో ఉండ‌దు. మ‌న‌సు.. మాట్లాడే తీరు, ఇత‌రుల‌కు ఇచ్చే గౌర‌వంపై ఆధార‌ప‌డి ఉంటాయి. అది చ‌ల‌ప‌తిరావులాంటివాళ్లు గుర్తుంచుకొంటే మంచిది. ఇక‌నైనా ఆ నోటిని అదుపులో పెట్టుకొంటే ఇంకా మంచిది. యాంక‌ర్ భామ‌లు.. పోగ్రాంకి ఏదో పెద్దాడొచ్చాడు క‌దా అని మైకు ఇవ్వ‌కుండా.. మీరూ కాస్త జాగ్ర‌త్త‌లోనే ఉండ‌డ‌మ్మా. ఆ బూతులు విన‌డానికి మీకు సొంపుగా ఉంటాయేమో గానీ.. జ‌నాల‌కు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.