అనంతపురం సభ తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో తెలుగుదేశం ఆచితూచి స్పందిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారులో అవినీతి పెరిగిపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయనీ, ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత పెరుగుతోందనీ, అమరావతి కొందరి రాజధానిగా మాత్రమే మారుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయంటూ పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఇప్పటికే చాలా జాగ్రత్తగా స్పందించారు కొంతమంది తెలుగుదేశం నాయకులు! అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందా అని చాలామంది వేచి చూస్తున్న మాట వాస్తవమే. ఎందుకంటే, సామాజిక వర్గమూ అవినీతీ ప్రాంతీయ అసమానతలు అంటూ టీడీపీపై పవన్ చేసిన ఆరోపణలు కాస్త తీవ్రమైనవే కదా! వాటిపై స్పందంచాల్సిన అవసరం ఉంటుంది కదా! అయితే, పరోక్షంగా పవన్ విమర్శల్ని తిప్పికొట్టారు చంద్రబాబు అనాలి!
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఎన్నడూ లేనివిధంగా పెట్టుబడులు వస్తున్నాయంటూ అందుకు కారణం, తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాలే అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లను, పోర్టులు, విమానాశ్రయాలు రైల్వేల అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించేందుక నిరంతరం కృషి చేస్తున్నాం అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా చేసే దిశగా అభివృద్ధి కార్యక్రమాలున్నాయన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ అన్యాయం జరగనీయమన్నారు. ఏ వనరులేని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినప్పుడు, అన్నీ ఉన్న ఆంధ్రాని అభివృద్ధి చేయడం ఏమంత కష్టమైన పని కాదన్నారు. కొంతమంది కావాలనే తమ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారనీ, వారు చేస్తున్నవి సద్విమర్శలు అయితే కచ్చితంగా వాటిని సానుకూలంగా స్వీకరిస్తామని కూడా చెప్పారు.
సో… పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసినట్టే కదా! అవినీతి గురించి పవన్ ఆరోపించారు! దానికి బదులుగా.. అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పేశారు. అసమానతల వల్ల మరోసారి ప్రాంతీయ తత్వం ప్రబలే ప్రమాదం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు కదా! అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పేసినట్టే. మొత్తానికి పవన్ కల్యాణ్‌ను పేరును ఎక్కడా ప్రస్థావించకపోయినా… అనంతపురంలో ఆయన ఏ పాయింట్లను బేస్ చేసుకుని తెలుగుదేశం పాలనపై విమర్శలు చేశారో, వాటన్నింటినీ పరోక్షంగా ప్రస్థావిస్తూ తిప్పి కొట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడి ఉంటే పరిపూర్ణమయ్యేది. మొత్తానికి, పవన్ కల్యాణ్ విషయంలో చాలా జాగ్రత్తగానే స్పందించారని అనుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మంగా స్పందించారని అనుకోవాలి.