వైఎస్, బాబు…దొందూ దొందే…ఒప్పేసుకున్న బాబు

వైఎస్ నీచుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు అంటూ విరుచుకుపడుతూ ఉంటారు చంద్రబాబు అండ్ కో. కానీ వైఎస్ విధానాలను మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ కొట్టేస్తూ ఉంటారు. 2004లో ఉచిత విద్యుత్, రుణమాఫీ హామీలు వైఎస్‌ని పవర్‌లోకి తెచ్చాయి. ఆ ఎన్నికల సమయంలోనే ఉచిత హామీలు ఎందుకు సాధ్యం కాదో, ఉచిత హామీల వళ్ళ జరిగే నష్టాలేంటో సవివరంగా ఓటర్లకు వివరించాడు చంద్రబాబు. ఓటర్లు కూడా చంద్రబాబును పదేళ్ళపాటు అధికారానికి దూరం చేశారు. ఇక 2014 ఎన్నికల టైం వచ్చేసరికి వైఎస్ కంటే ఎన్నో రెట్లు మించిపోయిన స్థాయిలో ఉచిత హామీల వర్షం కురిపించాడు చంద్రబాబు. అమలు చేయకపోయినా ఫర్లేదు…భజన మీడియాతో ‘మేనేజ్’ చేయొచ్చులే అని ముందుగానే ఫిక్సయ్యాడో ఏమో తెలియదు కానీ ఆల్ ఫ్రీ అని ఎన్నికల పాట పాడాడు. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం చంద్రబాబు చెప్తున్న రుణమాఫీ హామీలు అమలు చేయడం అసాధ్యం అని చెప్పుకొచ్చాడు. 2004లో చంద్రబాబు చేసినట్టుగా జగన్ చేస్తే….చంద్రబాబు మాత్రం ఎంచక్కా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూటును ఫాలో అయిపోయి కుర్చీ ఎక్కేశాడు.

ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా వైఎస్ చేసిన అన్ని తప్పులనూ చేస్తున్నాడు చంద్రబాబు. పట్టిసీమ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైఎస్ హయాంలో పుష్కరాల టైంలో నలుగురైదుగురు చనిపోతేనే నానా హంగామా చేసిన చంద్రబాబు తన పుణ్యమా అని ముఫ్పైమంది భక్తులు చనిపోయినా ‘మేనేజ్’ చేసేశాడు. ఇక ఇఫ్పుడు ఫిరాయింపుల విషయంలో కూడా వైఎస్ బాటనే నడుస్తున్నాడు. ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు వైఎస్ హయాంలో టిడిపి ఎమ్మెల్యేలను, ఎంపిలను లాక్కున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఎదురుదాడికి దిగాడు చంద్రబాబు.

మన రాజకీయ నాయకులంత మాటకారులు ఇంకెవరూ ఉండరేమో. ఇదే చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పనేంటి? కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలను, తప్పులను ప్రజలకు వివరించడమే. అందుకోసం రోజుల తరబడి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా కాంగ్రెస్ తప్పులను కడిగిపారేస్తానని ప్రగల్భాలు పలికాడు. వైఎస్, వైకాపా తప్పుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఓ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటాడు చంద్రబాబు. వాళ్ళకసలు ఓట్లడిగే అర్హతే లేదు, మనుషులే కాదు అని మాట్లాడేస్తూ ఉంటాడు. అదే చంద్రబాబు తప్పుల గురించి ప్రశ్నిస్తే మాత్రం ….ఏం వైఎస్ చేయలేదా? నేను చేస్తే తప్పేంటి? అని ఎదురుదాడికి దిగుతాడు. అంటే చంద్రబాబుకు వైఎస్‌కు లాగే ఓట్లడిగే హక్కులేదని ఆయనే ఒప్పుకుంటున్నట్టా? వైఎస్ చేసిన తప్పులనే చేస్తూ ఉన్న చంద్రబాబుకు…వైఎస్‌ల తప్పుల గురించి మాట్లాడే అర్హత ఏముంటుంది? అంతా కూడా దొందూ దొందే వ్యవహారమేగా. అంతోటిదానికి నేను నిప్పు అని చెప్పి నోరు నొప్పి పుట్టేలా కేకలు వేయడం ఎందుకు? నేను, వైఎస్…ఇద్దరం కూడా ఒకే గూటి పక్షులం అని చెప్పొచ్చుగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.