టీ టీడీపీపై ఈ శ్ర‌ద్ధ ముందే ఉంటే బాగుండేది!

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అంప‌శ‌య్య మీద ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. పేరున్న నాయ‌కులు లేరు. ఉంద‌ని చెప్పుకుంటున్న క్యాడ‌ర్ కు అండ‌గా నిలిచే పెద్ద దిక్కూ లేరు. ఒక్కొక్క‌రుగా పార్టీని వీడిపోయారు. మొద‌ట్లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు వెళ్లిపోతున్న‌ప్పుడు పార్టీకి భారీ న‌ష్టం అనుకుని విశ్లేషించుకున్నారు. తెలంగాణ‌లో పార్టీకి రేవంత్ రెడ్డి ఆశాకిర‌ణం అనుకుంటే.. ఆయ‌నా ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వ‌ర‌లోనే ఉమా మాధ‌వ‌రెడ్డి కూడా గుడ్ బై చెప్ప‌డానికి కావాల్సిన ఏర్పాట్ల‌న్నీ చేసుకున్నారు! కొన్నాళ్లుగా పార్టీలో మిగిలిన నేత‌ల‌కు, కేడ‌ర్ కు చాలా అనుమానాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ లేదా తెరాస‌లో చేరితే లాభాలు ఉంటాయ‌నే ఆశ క‌న్నా… టీడీపీలో కొన‌సాగితే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుందా అనే అనుమానాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు రంగంలోకి దిగారు. చాన్నాళ్ల త‌రువాత మ‌రోసారి హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో రాష్ట్ర నేత‌ల‌తో సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌య్యారు. భ‌విష్య‌త్తు వ్యూహాల గురించి నేత‌ల‌తో చ‌ర్చించారు.

రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బ‌య‌ట‌కి వెళ్ల‌గానే చంద్ర‌బాబు హైద‌రాబాద్ కి వ‌చ్చి, నేత‌లూ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం అప్పుడే చేశారు. కుటుంబ స‌భ్యులకంటే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాన‌ని చెప్పారు. కార్య‌క‌ర్త‌లే నాయ‌కులను త‌యారు చేస్తార‌నీ, కొంత‌మంది వెళ్లిపోతే కొత్త‌వారు వ‌స్తార‌ని కూడా చెప్పారు. ఇక‌, తాజా స‌మావేశానికి వ‌స్తే.. ప్ర‌తీ గురువారం టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా తెలంగాణ నేత‌ల‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. రాష్ట్ర స్థాయి నేత‌ల నుంచి నియోజ‌క వ‌ర్గ స్థాయి వ‌ర‌కూ అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. అంతేకాదు, నెల‌కోసారి హైద‌రాబాద్ వ‌చ్చి ఇలాంటి విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. పార్టీలో ఖాళీగా ఉన్న ప‌ద‌వుల భ‌ర్తీ అంశంతోపాటు, ఉత్సాహంగా ప‌నిచేస్తున్న‌వారికి గురించి, ప్రోత్స‌హిస్తామంటున్న భ‌రోసా ఇచ్చారు.

మొత్తానికి, తెలుగుదేశంలో కొన‌సాగితే భ‌విష్య‌త్తు ఉంటుంద‌నీ, కొన‌సాగాల‌నుకుంటున్న‌వారికి తాను అండ‌గా ఉంటాన‌ని మ‌రోసారి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం ఈ తాజా సమావేశం ద్వారా చేశార‌నే చెప్పుకోవ‌చ్చు. అయితే, ఇదేదో మొద‌ట్నుంచీ చేసి ఉంటే పార్టీ ప‌రిస్థితి వేరేలా ఉండేది. అప్ప‌ట్లో ఆయ‌న ఆంధ్రాకి వెళ్లిపోతూ తెలంగాణ పార్టీని కుమారుడు లోకేష్ చేతుల్లో పెట్టారు. ఆ త‌రువాత రాజ‌కీయ భ‌విష్య‌త్తు దృష్ట్యా లోకేష్ ను కూడా ఆంధ్రా రాజ‌కీయాల్లోనే కీల‌కం చేస్తూ… తెలంగాణ పార్టీని వ‌దిలేశారు. నాయ‌కులు స్వ‌తంత్రంగా ఎద‌గాలంటూ కొన్నాళ్లు చెప్పారు. ఇప్పుడు, తానే అందుబాటులో ఉంటాన‌నీ, అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏదేమైనా, రేవంత్ రెడ్డి వెళ్లాక టీడీపీలో ఆ లోటును భర్తీ చేసే స్థాయి నేత‌ పార్టీలో చంద్ర‌బాబుకు క‌నిపించ‌డం లేద‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.