చంద్రన్న డీలా…. అంతర్గత గోల!!

చంద్రన్న బీమా పథకం ఎలాగున్నా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం డీలా పడిపోతున్నారనిపిస్తుంది. వారంలో నాలుగు రోజులు ఆయన పార్టీ నాయకులను రప్పించి సర్దిచెప్పడం, హెచ్చరించడం ఇదే సరిపోతున్నది. తాజాగా నంద్యాల‌లో భూమా అఖిల ప్రియ- ఎ.వి,సుబ్బారెడ్డి వ్యవహారం సర్దుబాటు చేయలేక సతమతమవుతుంటే ఎంపి జెసి దివాకరరెడ్డి మరోసారి రచ్చకెక్కారు. వారందరినీ పిలిపించి సూక్తులు చెప్పి పంపడం, మీడియాకు బ్రీఫింగు ఇవ్వడం ఒక తతంగంలా మారింది.

గత రెండేళ్లలోనూ ఈ సర్దుబాటు ప్రహసనం పరిస్థితిని దిగజార్చడం తప్ప మెరుగుపర్చింది లేదు. ప్రకాశం జిల్లాలో హత్యల వరకూ వెళ్లాయి ముఠాతగాదాలు. విజయవాడలో ఆర్‌టిఎ కమిషనర్‌నే ఎంపి కేశినేని, బోండా ఉమల దురుసుతనం విమర్శలకు గురైంది. తర్వాత ఆయనతోనూ క్షమాపణ చెప్పామనిపించారు. నెల్లూరు కడప, కర్నూలు కృష్ణా ఇలా ప్రతిచోటా తెలుగుదేశం శిబిరాలుగా విడిపోయింది.విశాఖలోనైతే ఇద్దరు మంత్రులు పరస్పరం ఆరోపణలు గుమ్మరించుకుంటున్నారు.

జెసి మేనల్లుడు ఎంఎల్‌సి దీపక్‌ రెడ్డిని హైదరాబాద్‌ భూ కుంభకోణంలో పోలీసులు అరెస్టు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్‌ పోలీసులపై దౌర్జన్యానికి గాను అభిశంసనకు గురైనారు. అయితే అంతిమంగా వీరెవరిపైనా పెద్ద చర్యలు తీసుకున్నది. దీనంతటికి చంద్రబాబు నిస్సహాయతే కారణంగా చెబుతున్నారు. నేను ఇటుకలు పేరుస్తుంటే మీరు బుల్‌డోజర్‌తో కూలగొడుతున్నారని ఆయన పార్టీవారితో అనడం ఇందుకు కారణం.

ఇది పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమేనని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు తర్వాత కూడా ఇతర పార్టీల వారిని విచక్షణా రహితంగా తీసుకుని పదవులు కట్టబెట్టడం వల్ల కలిగిన అనర్థమిది. స్వతహాగా టిడిపి వారి అక్రమాలూ వున్నాయి. ఇవి చక్కచేసేబదులు మరెవరిపైనో దాడి చేయాలని టిడిపి నేతలు తంటాలు పడటం అర్థరహితం.

ఇప్పుడు టిడిపిలో మూడు తరహాలున్నారు- వీర విధేయులుగా విచారంతో అధినేతను ఆశ్రయిస్తున్నవారు. అలాగే ఇతరపార్టీల నుంచి వచ్చి ఇమిడిపోయిన వారు రెండవ రకం. ఈ రెండు రకాల వారి మధ్య నలిగిపోతున్న సాధారణ నేతలు కార్యకర్తలు మూడో రకం.బిజెపి కేంద్రం శాసనసభ స్థానాలు పెంచుతుందో లేదో ఇంకా తెలియదు. అదే జరక్కపోతే వున్నవారికి వచ్చిన వారికి కూడా కష్టమే. కాబట్టి జరగడనే అంచనాతోనే ఎవరి తంటాలు వారు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్రేకాలు పెరుగుతున్నాయి. ఏమైనా వైఎస్‌ఆర్‌సిపిలోకి తిరిగి వలసలు కూడామొదలవడం తెలుగుదేశం నాయకత్వం కాదనలేని నిజం. ఉన్నవారిలోనూ అత్యధికులు ఉడికిపోతున్న మాట ఇంకా నిజం. ఇదంతా ఎప్పటికి సరౌతుందో లోకేశ్‌ కైనా తెలుసా? పైగాపార్టీలో వారిని సంతృప్తిపర్చడంకోసం ప్రభుత్వ వ్యవహారాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చేసి సర్దేస్తే ముందు ముందు ఇంకా తీవ్ర పరిణామాలు రావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.