రాజమౌళి సాధించింది గొప్ప విజయమే….బాబు అత్యుత్సాహం తప్పు కాదా?

బలహీనులను, అవసరంలో ఉన్నవాళ్ళను ఆదుకోవడం, ప్రోత్సహించడం పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. కానీ మనవాళ్ళు మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. బలవంతులకు మరి కాస్త బలాన్ని ఇస్తున్నారు. కార్పొరేట్ జనాలకు మన పాలకులు ఇస్తున్న రాయితీలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళ దగ్గర ఎంతైనా సాగిలపడతారు. గట్టిగా వందమందికి ఉపాధి కల్పించే కంపెనీ విషయంలో కూడా ఎన్నొ గొప్పలు చెప్పుకుంటారు. అదే సమయంలో కోట్లాది మందికి ఉపాధినిస్తున్న వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలను మాత్రం పూర్తిగా నాశనం చేస్తున్నారు. పచ్చని పంట భూములను కాంక్రీట్ జంగిల్స్‌‌గా మారుస్తూ పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ప్రజలను నిప్పుటెండల్లో నిలబెడుతున్నారు. వాళ్ళు మాత్రం చలువరాతి పందిళ్ళలో ఉంటూ, ఎసి కార్లలో తిరుగుతూ, వేసవి విడిదికి చల్లగా ఉండే ఇతర దేశాలకు ప్రయాణాలు కడుతున్నారు. అలాంటివాళ్ళకు జనాల కష్టాలు తెలుస్తాయా? దశాబ్ధాలుగా చెప్తున్న రైతు బిడ్డను, గంజి తెలుసు, బెంజి తెలుసు, పేదల కష్టాలు తెలుసు లాంటి డ్రమెటిక్ డైలాగ్స్‌ని పక్కన పెడితే నిజంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతి సంవత్సరం రైతు మరణాలు పెరుగుతూ పోతాయా? పల్లెలు ఖాళీ అవుతూ ఉంటాయా?

మన పాలకులకు ఎప్పుడూ ఒక సచిన్ టెండూల్కర్‌లు, అంబానీలు, సినిమా హీరోలు మాత్రమే కనిపిస్తున్నారు. ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన వాళ్ళకు కోటాను కోట్ల నజరానాలు అందించడం కోసం, వాళ్ళతో కలిసి వేదికలు పంచుకోవడం కోసం పోటీలు పడే పాలకులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ని అభివృద్ది పరిచే విషయంలో ఉన్న చిత్తశుద్ధి ఎంతో అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడిక సినిమాలో ఉన్న విషయం ఎంత? ఎంత గొప్ప సినిమా అనే విషయం పక్కన పెడితే మార్కెటింగ్, పబ్లిసిటీ తెలివితేటలను కూడా అత్యద్భుతంగా ప్రదర్శించిన రాజమౌళి నిజంగానే చాలా గొప్ప విజయం సాధించాడు. మరీ ముఖ్యంగా బాహుబలి సాధించిన కలెక్షన్స్ రికార్స్డ్ విషయంలో తెలుగు సినిమా అభిమానులందరూ గర్వపడాల్సిందే. కానీ చంద్రబాబునాయుడి అత్యుత్సాహం మాత్రం విస్తుగొలుపుతోంది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్‌కి ఫోన్ చేసి అభినందించే సమయం లేకపోయిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడాడు చంద్రబాబు. ఇక రాజమౌళికి, బాహుబలి టీంకి సన్మాన కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ విజేతలు సాధించిన విజయాలలో తనకూ భాగం ఉంది అని చెప్పుకోవడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయంతో ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ సారి ఆ స్థాయిని పెంచుకుంటాడేమో చూడాలి. చంద్రబాబు పుణ్యమా అని చాలా చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు బోయపాటి శ్రీను. రాజధాని నిర్మాణం విషయంలో తన పేరు వినిపించినప్పుడు లౌక్యంగా తప్పుకుని మంచి పని చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఈ విషయంలో రాజమౌళి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు అత్యుత్సాహానికి రాజమౌళి కూడా జై కొట్టాడంటే మాత్రం రాజమౌళిపై కూడా విమర్శల దాడి పెరగడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com