ఆ ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబుది అతి చొర‌వా..?

ఆంధ్రా రాజ‌ధాని ప్రాంతంలో సింగ‌పూర్ కి చెందిన కంపెనీ నిర్మించత‌ల‌పెట్టిన ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు సర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఓ ప‌క్క విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా కూడా స్విస్ ఛాలెంజ్ విధానాన్నే అనుస‌రించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ నిర్ణ‌యం నేప‌థ్యంలో ఉన్న‌తాధికారులు, మేధావి వ‌ర్గాల నుంచి ఇప్పుడు కొన్ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి! సింగపూర్ కంపెనీల కోసం నియ‌మ నిబంధ‌న‌ల్ని అడ్డంగా తుంగ‌లోకి తొక్కేశార‌ని, ఇష్టానుసారం అనుమ‌తులు ఇచ్చేశారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌తీ ద‌శ‌లోనూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు లోప‌భూయిష్టంగా ఉన్నాయంటూ కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

సింగపూర్ కంపెనీల క‌న్సార్టియం వేసిన టెండ‌ర్ కు మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపిన తీరుపై కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మౌతున్నాయి. సింగిల్ టెండ‌ర్ ను అనుమ‌తించ‌కూడ‌దనే ప్ర‌భుత్వ నిబంధ‌న ఉంది. అయితే, దీనికి విరుద్ధంగా స‌ద‌రు కంపెనీల క‌న్సార్టియం వేసిన సింగిల్ టెండ‌ర్ కే రాజ‌ధాని భూముల‌ను ప్ర‌భుత్వం క‌ట్ట‌బెట్టింది. ఇదొక్క‌టే కాదు… అన్నిటిక‌న్నా ముఖ్యంగా స్విస్ ఛాలెంజ్ విధానంపై చాలా విమ‌ర్శ‌లున్నాయి. ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేయ‌డ‌మే ఈ ప‌ద్ధ‌తి ముఖ్యోద్దేశం అంటూ కేల్క‌ర్ క‌మిటీ ఏనాడో చెప్పింది. కేంద్రానికి ఆ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌లో ఇదే పేర్కొంది. అయితే, చంద్ర‌బాబు మాట మాత్రం మ‌రోలా ఉంది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ విధానం ఇదే అన్న‌ట్టు ఆయ‌న అంటున్నారు!

సింగ‌పూర్ కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి, అన్ని విష‌యాల‌పైన కూలంక‌షంగా చ‌ర్చించేందుకు ఓ హైప‌వ‌ర్ క‌మిటీని ప్ర‌భుత్వ‌మే వేసింది. మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి నేతృత్వంలోని ఈ క‌మిటీ రంగంలోకి దిగింది. చ‌ర్చ‌లు పూర్తికాకుండానే వ్య‌వ‌హారంలోకి చంద్ర‌బాబు ఎంట్రీ ఇచ్చేశారు. సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో ఆయ‌నే చ‌ర్చ‌లు జ‌రిపేశారు. ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌తోపాటు పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ చ‌క‌చ‌కా క్లియ‌ర్ చేసేశారట‌. ఏదో ప్రైవేటు సంస్థ వ్య‌వ‌హారం మాదిరిగా చంద్ర‌బాబు ఫోన్లోనే చ‌ర్చ‌లు కంప్లీట్ చేశార‌ట‌! ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఫోన్లో చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది ప‌లువురి ప్ర‌శ్న‌?

ఇక‌, వాటాల విష‌యానికొస్తే… స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో స‌ద‌రు సింగ‌పూర్ క‌న్సార్టియానికి 1691 ఎక‌రాలు ఇస్తార‌ట‌! దీన్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పేరుతో దాదాపు ఐదువేల కోట్లు వెచ్చిస్తార‌ట‌. వీటితో స‌ద‌రు క‌న్సార్టియం వ్యాపారం చేసుకుంటుంది! ఆ త‌రువాత‌, రాష్ట్రానికి లాభాల్లో 42 శాతమే ఇస్తుంద‌ట‌. మిగ‌తా 58 శాతం ఆ క‌న్సార్టియ‌మే ఉంచుకుంటుందిట‌! ఈ ప్రాజెక్టులో సింగ‌పూర్ క‌న్సార్టియం పెట్ట‌బోయే పెట్టుబ‌డులు ఎంతంటే రూ. 310 కోట్లు మాత్ర‌మేన‌ట‌!

మొత్తంగా, రాజ‌ధాని ప్రాంతంలో రియ‌ల్ దందా మొద‌లైంద‌నే విమర్శ‌లు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. సింగ‌పూర్ కంపెనీల కోసం ఏకంగా రాష్ట్ర చ‌ట్టాన్నే మార్చేశార‌నీ, స‌ద‌రు కంపెనీల‌కు చంద్ర‌బాబు ఏజెంట్ గా మారిపోయారంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి, ఈ ఆరోప‌ణ‌ల‌పై చంద్రబాబు స‌ర్కారు ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com