ప్రొ.నాగేశ్వర్: తెలంగాణ ముందస్తు ఎన్నికలు టీడీపీకి లాభమా..?

తెలంగాణలో కేసీఆర్.. ముందస్తుకు వెళ్తున్నారనే ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ కు లాభమా..నష్టమా అన్న అంశంపై.. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాదనలు, ప్రతివాదనలు వినబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీలో… ముందస్తు ఎన్నికలతో ఆశ పెరిగింది. ఫిరాయింపుల తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడింది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాల నుంచి దాదాపుగా వైదొలిగారు. ఏపీకే పరిమితమయ్యారు. టీ టీడీపీ నేతలకే పార్టీ కార్యక్రమాలు అప్పగించారు.

టీ టీడీపీపై చంద్రబాబు దృష్టి పెడితే మరింత ఓటు బ్యాంక్..!

కొంత కాలం నుంచి టీ టీడీపీ కార్యక్రమాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం కరవయింది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే.. చంద్రబాబు పూర్తిగా ఏపీపైనే దృష్టి కేంద్రీకరిస్తారని.. ఇప్పటి వరకూ వారు అనుమానించారు. ఎందుకంటే.. చంద్రబాబుకి ఏపీలో… అధికారం నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అక్కడ రాజకీయ పరిస్థితులు కూడా క్లిష్టంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో… తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయించడం కష్టం. దానితో పాటు..తెలంగాణలో ఏం మాట్లాడినా.. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే.. ఈ సమస్య ఉండదు. చంద్రబాబు సమయం కేటాయించగలుగుతారు. ముఖ్యంగా చంద్రబాబు.. టీ టీడీపీ కోసం కొంత సమయం కేటాయింగలిగితే రాజధానిలో కొంత ఓటు బ్యాంక్ సమీకృతమవుతుంది. దీనికి కారణం.. సీమాంధ్ర ఓటర్లతో పాటు.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన కృతజ్ఞత మధ్యతరగతి ప్రజల్లో ఉంది. వారంతా.. చంద్రబాబుపై సానుభూతితో ఉన్నారు. చంద్రబాబు కొంత ఎక్కువ దృష్టి పెడితే వారంతా టీడీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది.

చంద్రబాబు ఎంత ప్రచారం చేస్తే అంత లాభం..!

ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు… ఖమ్మం లాంటి.. ఏపీ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో కూడా… టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు అంతకు ముందు ఎలాంటి బలం లేదు. కేవలం టీడీపీని వీడి.. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరిన తర్వాతనే… అక్కడ టీఆర్ఎస్ ఎంతో కొంత బలపడింది. పాలేరులో గెలిచింది. పాలేరులో టీఆర్ఎస్ గెలవడం సూచిక కాదు. కొన్ని పరిణామాలు కలిసొచ్చాయి. ఒక వేళ చంద్రబాబు సీరియస్ గా ప్రచారం చేస్తే.. ఖమ్మం జిల్లాలోనూ టీడీపీ ప్రభావం చూపుతుంది. కనీసం తెలంగాణలో రెండు, మూడు పార్లమెంట్‌ సీట్లులో… 20 నుంచి 30 సీట్లలో టీడీపీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

టీ టీడీపీకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి..!

2014లో తెలంగాణ సెంటిమెంట్ అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో.. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ 15 సీట్లు దక్కిచుకుంది. కాంగ్రెస్ తో పోల్చినా.. టీఆర్ఎస్ తో పోల్చినా… 2014 లో టీడీపీ సాధించిన ఫలితాలు చాలా బాగా వచ్చినట్లు లెక్క. బీజేపీ ఐదు సీట్లు… టీడీపీ 15 సీట్లు గెలిచింది. అయితే ఇప్పటితో పోలిస్తే.. ఇప్పుడు.. కొన్ని ప్రతికూలతలు టీడీపీకి ఉన్నాయి. అప్పటితో పోలిస్తే.. చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. అలాగే.. అప్పట్లో సీమాంధ్ర ఓటర్లలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేదు. అలాగే బీజేపీతో పొత్తు లేదు. ఇన్ని ప్రతికూలతలు ఉండి కూడా 20 నుంచి 30 సీట్లలో ప్రభావం చూపించే పరిస్థితిలో ఉంది. ఓబీసీ ఓటర్లలో సానుకూలత ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తులు ఉంటే ఓట్లన్నీ కన్సాలిడేట్ అవుతాయి.

కాంగ్రెస్‌తో పొత్తుకు కారణాలు దొరుకుతాయి..!

కాంగ్రెస్‌తో పొత్తు అనేది.. ఏపీ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అయితే.. ఏపీ టీడీపీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్‌తో కలుస్తారా లేదా అన్నది… రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ , మిజోరం ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే.. సహజంగానే ఆ పార్టీకి సానుకూలత వస్తుంది కాబట్టి.. అప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం అవుతుంది. జమిలి ఎన్నికలు వస్తే.. కాంగ్రెస్‌తో పొత్తు అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందికరం అయ్యేది. కానీ తెలంగాణ ఎన్నికలు.. విడిగా రావడం వల్ల… సమర్థించుకోవడానికి… అవకాశం దొరికింది. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న… టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా… కూటమి కడుతున్నామని.. వాదన వినిపించే అవకాశం ఉంది. అలాగే.. మోడీ మళ్లీ ప్రధాని కాకుండా చేసేందుకు మోడీకి మిత్రునిగా కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ తో కలిశామని చెప్పుకోవచ్చు. మోడీ అధికారంలో రాకుండా చేసే ఏ అవకాశాన్ని వదులుకోమని చెప్పుకునే అవకాశం ఉంది.

పొత్తుపై ప్రజాభిప్రాయం తెలుసుకోవచ్చు..!

ఆంధ్రలో పొత్తు లేకుండా.. తెలంగాణలో పొత్తులతో కలిసి పోటీ చేయాలంటే.. ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా కష్టం. విడివిడిగా ఎన్నికలు జరిగితే… అంటే.. తెలంగాణలో ముందస్తు జరిగిన ఐదారు నెలల తర్వతా జరిగితే.. రాజకీయ పరిణామాలు మారిపోతాయి. ఒక వేళ తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌తో కలవడాన్ని ఓ ప్రయోగంగా భావించవచ్చు. కాంగ్రెస్ తో కలవడం… టీడీపీకి లాభం, నష్టం అనే రెండు వాదనలు టీడీపీలో ఉన్నాయి. వీటిలో ఏది నిజం అనేది.. ఎన్నికలు జరిగితేనే తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలతో దీనికి క్లారిటీ వస్తుంది. తెలంగాణలో సానుకూల ఫలితాలు వస్తే.. మరో మాట లేకుండా… ఏపీలో కూడా.. పొత్తులు పెట్టుకుంటారు. లేదంటే.. పట్టించుకోరు. ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు వేర్వేరని తప్పించుకుంటారు. అందుకే.. తెలంగాణలో పొత్తులతో ఓ పరీక్ష చేయాలన్నది టీడీపీలో ఉన్న ఆలోచన.

కింగ్ మేకర్ అవుతామని ఆశలు..!

తెలంగాణలో టీడీపీకి అధికారం లేదు. అధికారం వచ్చే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఎన్నికలకు కావాల్సిన సరంజామా సమకూర్చుకోవడం కష్టమవుతుంది. ఒకే సారి ఎన్నికలు వస్తే… ఏపీతో పాటు..తెలంగాణ టీడీపీకి వనరులు సమకూర్చడం.. చంద్రబాబుకు కష్టమవుతుంది. విడిగా జరిగితే.. కొన్ని వనరులైనా పార్టీ సమకూర్చే అవకాశంఉంది. అందుకే.. ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌కు ఎంత మేర లాభం చేస్తాయో కానీ.. తమకు మాత్రం లాభమని.. టీ టీడీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ద్వారానో.. సొంతంగా పోటీ చేయడం ద్వారా ఓ ఇరవై సీట్లు సాధించి.. ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి వస్తే.. తామే కింగ్ మేకర్ అవుతామని.. టీ టీడీపీ నేతలు ఆశల్లో ఉన్నారు. దీన్ని కొట్టి పారేయలేం కూడా. ఇలా జరిగితే.. టీడీపీకి ఆంధ్రలోనూ ప్లస్ అవుతుంది. అందుకే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం .. కేసీఆర్‌కన్నా.. ఎక్కువగా టీ టీడీపీనే ఎదురు చూస్తోందని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com