మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డితో సహా దేశంలోని అన్ని ప్రధాన పార్టీలకు చంద్రబాబు లేఖలు రాశారు. ఆయన లేఖలు పంపిన పార్టీల అధ్యక్షులలో జగన్ కూడా ఉన్నారు. అయితే ఈ లేఖ వెనుక కేవలం మహిళా సాధికారత మాత్రమే లేదు, దాని వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. సాధారణంగా చూసేవారికి ఇది ఒక సాధారణ మద్దతు లేఖలా అనిపించినా అసలు లెక్క వేరుగా ఉంటుంది.
క్రెడిట్ పాలిటిక్స్
మహిళా బిల్లుకు జగన్ ఎలాగూ మద్దతు ఇస్తారు, ఎందుకంటే అది జాతీయ స్థాయిలో ఒక సెంటిమెంట్. అయితే, జగన్ తనంతట తాను మద్దతు ప్రకటించకముందే చంద్రబాబు లేఖ రాయడం ద్వారా, ఈ బిల్లు ఆమోదం పొందితే, చంద్రబాబు అడిగినందునే జగన్ మద్దతు ఇచ్చారు అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేలా చేశారు. దీనివల్ల బిల్లుకు లభించే క్రెడిట్లో కొంత భాగం తన ఖాతాలోకి వెళ్లేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇదంతా పైకి కనిపించేది. కానీ అసలు ట్రాప్ వేరే ఉంది.
డీలిమిటేషన్ ఉచ్చు
అసలు రాజకీయం ఇక్కడే ఉంది. మహిళా బిల్లు అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. రేపు ఇదే అంశంపై జగన్ కేంద్రంపై పోరాడాలని చూసినా , ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చంద్రబాబును విమర్శించాలని చూసినా, నువ్వు కూడా ఈ ప్రక్రియకు మూలమైన బిల్లుకు మద్దతు ఇచ్చావు కదా అని వేలెత్తి చూపడానికి ఓ అవకాశంగా ఉంటుంది.
జగన్ విమర్శలకు అడ్డుకట్ట
భవిష్యత్తులో డీలిమిటేషన్ వల్ల ఏపీకి సీట్లు తగ్గి అన్యాయం జరిగితే, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండి అన్యాయం చేశారని జగన్ వాదించే అవకాశం ఉంది. కానీ జగన్ బిల్లుకు మద్దతివ్వకపోతేనే. మద్దతిస్తారు కాట్టి ఈ లేఖ ద్వారా జగన్ను కూడా అదే దారిలోకి లాగడం ద్వారా, ఆ విమర్శ చేసే నైతిక హక్కును జగన్ కోల్పోయేలా చంద్రబాబు చేశారు. అంటే, అన్యాయం జరిగిందని ప్రజలు భావించే పరిస్థితి వస్తే దొందూ దొందే అనే భావాన్ని ప్రజల్లోకి పంపిస్తారు
జగన్ ఈ లేఖకు స్పందించినా, స్పందించకపోయినా చంద్రబాబుకు లాభమే. మద్దతిస్తే చంద్రబాబు వ్యూహంలో భాగస్వామి అయినట్లు, మౌనంగా ఉంటే మహిళా వ్యతిరేకిగా ముద్ర వేసే అవకాశం దొరుకుతుంది. మొత్తానికి, మహిళా బిల్లు అనే అంశాన్ని అస్త్రంగా చేసుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే డీలిమిటేషన్ చిక్కుల నుండి తనను తాను కాపాడుకుంటూనే, ప్రత్యర్థిని ఇరుకున పెట్టడం చంద్రబాబు మార్క్ రాజకీయ చాణక్యానికి నిదర్శనం అనుకోవచ్చు.
