పోలవరం గ్యాలరీ వాక్..! కేక్ వాక్‌గా పబ్లిసిటీ చేసుకున్న టీడీపీ..!!

పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్ వే గ్యాలరీ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో అంత్యంత కీలకమైన స్పిల్ వే నిర్మాణంలో అంతర్భాగంగా నిర్మించిన గ్యాలరీలో ముఖ్యమంత్రి “గ్యాలరీ వాక్” నిర్వహించారు. రెండు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో 1069.5 మీటర్ల పొడవున స్పిల్ వే లోపల సొరంగం తరహాలో స్పిల్ వే గ్యాలరీని నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గ్యాలరీ వాక్ ను పండుగలా నిర్వహించుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 48 బ్లాకులు, 1.054 కిలోమీటర్లు నడిచారు. తానే శంకుస్థాపన చేశా.. తానే గ్యాలరీ వాక్ చేసినందుకు.. చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది మేలోపు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. నిద్రపోయేటప్పుడు కూడా గుర్తొచ్చే ప్రాజెక్టు పోలవరమన్నారు. పోలవరంలో కొన్ని వందల మిషన్లు పనిచేస్తున్నాయని వివిధ దేశాల నుంచి అత్యాధునిక యంత్రాలు తెప్పించామని.. డబ్బులు చెల్లించకపోతే పనులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నా గొంతులో ప్రాణమున్నంత వరకు అపజయమనేదే లేదని.. విజయం సాధించి తీరతానన్నారు. నాగార్జునసాగర్‌కు నెహ్రూ శంకుస్థాపన చేస్తే…ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్‌ చేశారని .. పోలవరానికి తానే శంకుస్థాపన చేసి తానే గ్యాలరీ వాక్‌ చేశానన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పట్టిసీమ పూర్తిచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నవాళ్లు… 10 నెలల్లో పూర్తిచేస్తే ఎవరూ మాట్లాడటంలేదని విమర్శించారు. వంశధార-నాగావళి, కృష్ణా-పెన్నాను అనుసంధానం చేసే..మహాసంగ్రామాన్ని చేపట్టామని భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టును అందరూ సందర్శించాలని…కట్టేటప్పుడు చూస్తేనే అవగాహన వస్తుందన్నారు.

జలాశయం నిండి, అదనంగా వచ్చే వరద నీటిని గేట్ల ద్వారా నది దిగువకు విడుదలచేయడానికి ఉపయోగపడే నిర్మాణమే స్పిల్‌వే. స్పీల్‌వేలో అంతర్భాగంగా నిర్మించే గ్యాలరీతో నాలుగు రకాల ప్రయోజనాలు ఉంటాయి. జలాశయంలోని నిల్వవుండే నీరు భూమి అడుగు నుండి డ్యాం మీద కలిగించే ఒత్తిడిని తగ్గించడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. అలాగే కాంక్రీట్ నిర్మాణం నుండి చెమ్మ రూపంలో వచ్చే ఊట నీటిని బయటకు తోడటానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. డ్యాం భద్రతను తనిఖీచేయడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. ఈ విధమైన గ్యాలరీలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో కూడా నిర్మించారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు… ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com