✍ విజయనగరం జిల్లా టీడీపీలో ఈ మధ్య విబేధాలు ఎక్కువయ్యాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతి ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఆయన ఢిల్లీలో బిజీ అయిపోవడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఎవరి దారి వారిదే అన్నట్టుగా తయారైంది. అధికార పార్టీ అయినప్పటికీ అందుకు తగ్గ జోష్ క్యాడర్ లో కనిపించడం లేదు. దీంతో ఇన్నాళ్లూ లైట్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు విజయనగరంపై దృష్టి పెట్టారు.
? ఇటీవల గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో విజయనగరం జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులు తదితర నేలంతా పాల్గొన్నారు. ఇందులో నేతల మధ్య గొడవలనే ప్రధానంగా ప్రస్తావించారట చంద్రబాబు.
జిల్లా నేతలకు పార్టీలో ఎవరెవరితో విబేధాలున్నాయి? ఎందుకున్నాయి? ఇలా ప్రతి చిన్న విషయంపైనా చంద్రబాబు దగ్గర నివేదిక ఉందట. బాబుగారు పేర్లతో సహా చెబుతుంటే విజయనగరం జిల్లా టీడీపీ నేతలు షాకైపోయారట. నేతల చిట్టా విప్పుతుంటే.. వారంతా నోరెళ్లబెట్టినట్టు టాక్.
? అంతేకాదు ఇప్పటికైనా ఈ విబేధాలను మరిచి పనిపైన దృష్టి పెట్టాలని చంద్రబాబు హితవు పలికారట. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం.
? మొత్తానికి చంద్రబాబు క్లాస్ తో జిల్లా టీడీపీ నేతలు దారిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు చేతిలో మొత్తం జాతకం ఉండగా… వారు మరోసారి ఇంటర్నల్ వార్ కు దిగే అవకాశాలైతే లేవు. మరి ఎంతైనా చంద్రబాబు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!! ఆయన ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా?