బెదిరింపులకు భయపడం.. కేటీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం : చంద్రబాబు

రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై… టీడీపీ అధినేత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బెదిరింపులకు దిగుతున్నారు…బెదిరిస్తే భయపడే ప్రశ్నే లేదన్నారు. నాలుగు బిల్డింగులు కట్టిన చంద్రబాబుకు అంత ఉంటే.. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇంకెంత ఉండాలని…కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సింగిల్ పాయింట్ సమాధానం ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తేల్చారు. కూకట్ పల్లిలో.. నందమూరి సుహాసినికి మద్దతుగా రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తన ప్రసంగాన్ని వ్యూహాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. వారు ఎంతో కాలంగా చూస్తున్న హామీలను కూడా ఇచ్చారు. తాను ఎందుకొచ్చానో ఈ సభలు చూస్తే కేటీఆర్ గుడెల్లో రైళ్లు పరుగెడతాయన్నారు. ప్రజల గుండెల్లో తనకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు. నాలుగు బిల్డింగులు కడితే సరిపోతుందా? అని అన్నారని.. కానీ బిల్డింగులే కాదని.. ఎన్నో కంపెనీలు తెచ్చాం.. ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని .. సైబరాబాద్‌కు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. సైబరాబాద్‌ నిర్మాణంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్ర లేదు లేదని స్పష్టం చేసారు. ప్రగతి భవన్‌ కట్టుకోవడం తప్ప కేసీఆర్‌ చేసిందేమీ లేదని కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాలుగు ఇటుకలు కూడా వేయలేదని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సూటిగా సమాధానం ఇచ్చారు. అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుందని.. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. ఒకప్పుడు సైబరాబాద్‌ సృష్టికర్తను… ఇప్పుడు అమరావతి సృష్టికర్తనని చెప్పుకున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో కాపులు.. టీఆర్ఎస్ కు మద్దతిస్తారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో.. చంద్రబాబు అలర్ట్ అయ్యారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక…26 కులాలను బీసీ జాబితాలో చేర్చుతామని ప్రకటించారు. కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే… స్వార్థం కోసం పార్టీ మారారని… ఈ సారి టీడీపీ పౌరుషం చూపిద్దాం…మోసం చేసినవాళ్లకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. నందమూరి ఆడబిడ్డను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని కూకట్ పల్లి ఓటర్లకు పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com