ఎపి టీడీపీ ముందు రేవంత్… వెనుక బాబు

ముందు నుయ్యి, వెనుక గొయ్యి సామెత‌ను మార్చి రాసుకుంటున్నారు ఎపి టీడీపీ నేత‌లు. కాంగ్రెస్‌లోకి పోవాల‌నుకుంటున్న రేవంత్‌… త‌న స‌త్తా చాట‌డానికో, పార్టీ పెద్ద‌ల్ని డిఫెన్స్‌లో ప‌డేయ‌డానికో చూపిన మాట‌ల దూకుడు బాగానే ప‌నిచేసింది. నిజానికి ప్ర‌తి ప‌క్ష వైసీపీ సైతం తీసిక‌ట్టు అనే స్థాయిలో రేవంత్‌రెడ్డి స్వంత పార్టీ నేత‌ల‌పై ఆరోప‌ణ‌ల బాంబులు పేల్చాడు. ఇప్ప‌టిదాకా మాట్లాడితే కెసియార్ కి చంద్రబాబు సాగిల‌ప‌డ్డాడంటూ వినేవారికి కూడా విసుగొచ్చేలా చెప్పిందే చెప్పుకుంటూ వ‌స్తున్న వైసీపీ క‌న్నా మిన్న‌గా, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కూ తెలంగాణ‌లో కెసియార్‌తో ఉన్న ఆర్ధిక వ్య‌వ‌హారాల గుట్టు మ‌ట్టు విప్పి…ఖంగు తినిపించాడు.

ఇదే విమ‌ర్శ‌లు మ‌రెవ‌రైనా చేసి ఉంటే ఈ పాటికి తెలుగుదేశం గ‌ల్లీ స్థాయి లీడ‌ర్ నుంచి మొద‌లుకుని ప్రెస్‌మీట్లు పెట్టి ఎదురుదాడి చేసేసేవారు. రోజుల త‌ర‌బ‌డి మాట్లాడుతూ… మొత్తం మీద త‌మ మీద విమ‌ర్శ‌లు చేసిన వ్య‌క్తి విశ్వ‌స‌నీయ‌త‌పై జ‌నాల‌కు అనుమానం రేకెత్తించ‌డంలో విజ‌యం సాధించేవారు. కాని… ఇప్పుడా ప‌రిస్థితి ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. ఒక రాష్ట్రంలో అధికార పార్టీ మీద ఇంత పెద్ద యెత్తున . అది కూడా సాదా సీదా వ్య‌క్తుల మీద కాదు ప్ర‌ధాన నేత‌ల‌పైన ఆరోప‌ణ‌లు వ‌స్తే.. కిమ్మ‌న‌కుండా కూర్చోవ‌డం బ‌హుశా ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే లేని అధ్యాయం అని చెప్ప‌వ‌చ్చు.

రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రిపైన రేవంత్ విరుచుకుప‌డ్డా… నోరెత్త‌లేని ప‌రిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్లిపోయిందంటే దానికి కార‌ణాలు ఏమైనా… ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ఎపి టీడీపీలో తీవ్ర అంత‌ర్మ‌ధ‌నం కొన‌సాగుతోంది. య‌న‌మ‌ల‌ని అలా ఉంచితే, ప్ర‌త్య‌ర్ధుల‌కు జ‌వాబు ఇవ్వ‌డంలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప‌య్యావుల కేశ‌వ్ వంటి సీనియ‌ర్ నేత‌, త‌మ మీద ఈగ వాలినా స‌హించ‌ని ప‌రిటాల కుటుంబం…కూడా నిశ్శ‌బ్ధంగా ఉండ‌క త‌ప్ప‌డం లేదు. దీనికి కార‌ణం చంద్ర‌బాబు సూచ‌న‌లే అని వేరుగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రేవంత్ విమ‌ర్శ‌ల‌పై తూర్పు గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యే వ‌ర్మ లాంటి ఒక‌రిద్ద‌రు ఏదో తిప్పికొట్టాల‌ని విఫ‌ల‌య‌త్నం చేసి ఊరుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న శ‌నివారం మాట్టాడాడు. ఏదో చేయ‌కుండా ఊరుకోలేక చేసిన‌ట్టున్న ఆయ‌న విమ‌ర్శ‌లు మ‌రింత కామెడీగా ఉన్నాయి. “ఎపి వాళ్లు తెలంగాణ‌లో కాంట్రాక్టులు చేసుకుంటే త‌ప్పేముంది?” “రేవంత్‌కు రాజ‌కీయ అవ‌గాహ‌న లేదు” అంటూ ఆయ‌న మాట్లాడ‌డం చూస్తుంటే ఎపి టీడీపీ నేత‌ల మైండ్‌సెట్ ఎంత గంద‌ర‌గోళంగా ఉందో తెలుస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో, అధినేత వ‌చ్చేదాకా, ఆయ‌న గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేదాకా నోర్మూసుకు కూర్చోవ‌డం త‌ప్ప వీరు చేయ‌గ‌లిగిందేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.