సచ్చిదానందస్వామి సమక్షంలో చంద్రబాబు, పవన్ చర్చలు..?

అమరావతిలో నిర్మించిన దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వీరిద్దరూ పక్క పక్కనే ఉన్నప్పటికీ.. ఒకరినొకరలు పలకరించుకోలేదు. ఇది బయటకు కనిపించిన దృశ్యం . కానీ అసలు విషయం మాత్రం వేరే ఉందట. అదే.. ఇద్దరూ కలిసి.. ఇరవై నిమిషాల పాటు చర్చలు జరపడం. ఆలయాన్ని నిర్మించిన లింగమనేని సంస్థ యజమానికి… అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్‌కల్యాణ్‌కూ సన్నిహిత సంబంధాలున్నాయి. అందకే ఆయన ఇద్దర్నీ ఆహ్వానించారు. కానీ ఇద్దర్నీ ఒకే సమయంలో రమ్మని మాత్రం ఆహ్వానించలేదు. ముందుగా పవన్ కల్యాణ్ వచ్చి వెళ్లిపోయేలా షెడ్యూల్ రూపొందించారు. అనుకున్న సమయానికే.. ఆలయానికి వచ్చిన పవన్… చంద్రబాబు రాక ముదే వెళ్లిపోతారనుకున్నారు.
కానీ పవన్ వెయిట్ చేశారు. చంద్రబాబు ఆలయానికి వెళ్లేసరికే.. పవన్ కళ్యాణ్ గర్భగుడిలో పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు వెళ్లిన వెంటనే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది. నవధాన్యాలు వేసేందుకు రావాల్సిందిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను గణపతి సచ్చిదానంద స్వామి ఆహ్వానించారు. స్వామీజికి కుడి వైపు చంద్రబాబు, ఎడమవైపు పవన్ కళ్యాణ్ నిలుచున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూసి అభివాదం చేయగా, చంద్రబాబు కూడా ప్రతినమస్కారం చేసి ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు వేశారు.

గర్భగుడి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత వారికి తీర్ధ ప్రసాదాలను అందచేసేందుకు గణపతి సచ్చిదానంద స్వామీజీ తన పూజ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో స్వామీజీతో పాటు పవన్, చంద్రబాబు, లింగమనేని సంస్థ అధినేత మాత్రమే అక్కడ ఉన్నారు. సుమారు ఇరవై నిమిషాల సేపు వీరి మధ్య చర్చలు జరిగాయి. కానీ రాజకీయాలు చర్చించారా .. లేక ఆలయ కార్యక్రమం కాబట్టి.. అధ్యాత్మిక అంశాలే చర్చించారా అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
జనసేన నాలుగో ప్లీనరీలో టీడీపీ విమర్శలు గుప్పించిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేరుగా ఎదురుపడటం ఇదే తొలిసారి. ఎవరికి వారు వెళ్లిపోకుండా.. మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, అభివాదం చేసుకోవడమే కాకుండా ఇరువురు ఇరవై నిమిషాల పాటు భేటీ కావడంతో ఇఫ్పుడు ఏం మాట్లాడుకున్నారనే దానిపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాజకీయాలు మాట్లాడుకోకపోయినా.. ఇది మళ్లీ… వారిద్దరి మధ్య స్నేహం పెరగడానికి కారణం కావొచ్చనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com