ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలపై స్పందించే తీరు ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది! ఏ అంశంపై ఆయన మాట్లాడినా దాన్లో ఎంతో కొంత స్కోత్కర్ష ధ్వనిస్తూ ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దేశశ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చ జరుగుతోందో అందరికీ తెలిసిందే. అమ్మకి ఏమైందో అనే విషయంపై స్పష్టమైన సమాచారం తెలియడం లేదు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. అమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయలలిత విషయమై మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్య చేసినట్టు తెలుస్తోంది!
ఇదొక్కటే కాదు… ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్జికల్ దాడుల గురించి కూడా ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. పాక్ విషయంలో మోడీ సర్కారు అనుసరించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ అంశంపై కూడా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారట! మంత్రులూ నేతలతో ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్జికల్ దాడుల ప్రస్థావన వచ్చింది. సర్జికల్ దాడుల తరువాత దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పొలిటికల్ ఇమేజ్ చాలాబాగా పెరిగిందని చంద్రబాబు అన్నారట! ఇలాంటి సమయంలో ఎవరైనా పొలిటికల్ ఇమేజ్‌లు చూసుకుంటారా చెప్పండీ..? చంద్రబాబు ఇలా అన్నారు అని తెలిశాక కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. సర్జికల్ దాడుల అనంతరం మోడీ ఎదుగుదలను ఈ కోణంలో చూసినవారు చంద్రబాబు తప్ప వేరెవ్వరూ ఉండరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక, అమ్మ విషయానికొస్తే… ఆమె త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఇతర పార్టీల నాయకుల కోరుకుంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నిర్వహించిన సమావేశంలోనే జయలలిత ఆరోగ్య పరిస్థితి కూడా చర్చకు వచ్చిందట! ఆమె త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు… అని అనుకుంటాం! కానీ, ‘జయలలితకు నేనంటే చాలా అభిమానం, నన్ను ఎంతో గౌరవంతో చూస్తారు’ అంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు. అందుకే, ‘ఈ సందర్భంలో ఇలా సొంత డబ్బా కూడా చెప్పుకుంటారా’… అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. సీరియస్ ఇష్యూస్‌పై కూడా ఇలా మాట్లాడితే విమర్శలు కాకుండా ఇంకేం వినిపిస్తాయి చెప్పండీ..!