అభిమాని వ‌స్తే.. అల్లుడు బ‌య‌ట‌కి వెళ్లాల్సిందే..!

ఎన్టీఆర్ ను చూస్తే చాలు మ‌హ‌ద్భాగ్యం అనుకునే మాంచి క్రేజ్ ఉన్న ఆరోజుల్లోనే… ఆయ‌న‌కి అల్లుడ‌య్యారు నేటి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎన్టీఆర్ కు అల్లుడైన క్ర‌మాన్ని స‌ర‌దాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వ‌రితో పెళ్లి ప్ర‌తిపాద‌న వారి బంధువుల నుంచి వ‌చ్చింద‌న్నారు. ఆ త‌రువాత‌, పెళ్లి చూపుల‌కు వెళ్లామ‌న్నారు. అయితే, పెళ్లి చూపుల‌కు వ‌చ్చిన త‌న‌కు ఎన్టీఆర్ ఓ పెద్ద పూల‌దండ తీసుకొచ్చి మెడ‌లో వేశార‌ట‌. ఎందుకంటే, మొద‌ట్నుంచీ తానంటే ఎన్టీఆర్ కు చాలా అభిమానం ఉండేద‌నీ, దానికి మించి త‌న‌పై ఒక అంచ‌నా ఆయ‌న‌కు ఉండేద‌న్నారు.

తాను ఒక గ్రామం నుంచి వ‌చ్చాన‌నీ, ఒక‌వేళ త‌న ప‌ద‌వి పోతే గ్రామానికి తిరిగి వెళ్లిపోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌నీ, అందుకు సిద్ధ‌మేనా అని భువ‌నేశ్వ‌రిని పెళ్లిచూపుల్లో అడిగాన‌న్నారు. ఎందుకంటే, ఆమె పుట్టి పెరిగిందంతా ప‌ట్ట‌ణ వాతావ‌ర‌ణం కాబ‌ట్టి, ముందుగానే ఈ విష‌యం చెప్పాన‌న్నారు. ఆమె కూడా స‌మ్మ‌తించ‌డంతో పెళ్లి జ‌రిగింద‌న్నారు. త‌న పెళ్లికి జిల్లావ్యాప్తంగా ప్ర‌తీ ఇంటికి శుభలేఖ‌లు పంపించాన‌న్నారు. పెళ్లి స‌మ‌యంలో ఎన్టీఆర్ ను ఒక‌టే కోరాన‌నీ… మిగ‌తా లాంఛ‌నాలు ఉన్నా లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌నీ, వ‌చ్చివారంద‌రికీ మాంచి భోజ‌నం పెట్టాల‌ని కోరాన‌న్నారు. అప్ప‌టికే తాను జిల్లాలో పేరున్న నాయ‌కుడు కావ‌డం, పైగా ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం అనేస‌రికి.. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారన్నారు. ఒక ద‌శ‌లో వ‌చ్చిన‌వారికి భోజ‌నాలు అందించ‌డం కూడా క‌ష్ట‌మైపోయింద‌న్నారు.

ఇక‌, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ… ఎదుటివారిని అంచ‌నా వేయ‌డంలో ఎన్టీఆర్ చాలా పర్ఫెక్ట్ అన్నారు. త‌న‌పై కూడా ఆయ‌న‌కు మంచి అంచ‌నా ఉంద‌నీ, క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కం ఆయ‌న‌కి త‌న‌పై బాగా ఉండేద‌న్నారు. త‌న ద‌గ్గ‌ర‌కి ఎవ్వ‌రొచ్చినా ఆ వ్య‌క్తిని చ‌దివేసి, ఒక అంచ‌నాకి రావ‌డంలో ఆయ‌న దిట్ట అన్నారు. అయితే, అభిమానుల విష‌యానికి వ‌చ్చేస‌రికి.. ఇలాంటివేవీ ఉండ‌వ‌నీ, విప‌రీత‌మైన ప్రేమ చూపించేవార‌న్నారు. ఎన్టీఆర్ తో తాను మాట్లాడుతున్న సంద‌ర్భంలో ఎవ‌రైనా అభిమానులు వ‌స్తే… త‌న ముందు ఆ అభిమానులు స‌రిగా మాట్లాడ‌లేరేమో అనే భావ‌న‌తో రెండో నిమిషాల‌ను న‌న్ను బ‌య‌ట కూర్చోమ‌న్న సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వారితో ఆయ‌న ఒంట‌రిగానే మాట్లాడేవారనీ, అభిమానులంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com