ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించి అంశాల‌పై టీడీపీ స‌ర్కారుతో చ‌ర్చించేందుకు కేంద్రం మ‌రోసారి సిద్ధ‌మౌతోంది. ఈ నెల 23న కేంద్ర హోం శాఖ నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తోంది. దీంతో అదే రోజు నిర్వ‌హించాల‌నుకున్న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని ఒక రోజు ముందుకు జ‌రిపారు. 23న ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే స‌మావేశానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దినేష్ కుమార్ తోపాటు కొన్ని కీల‌క శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, అధికారులు పాల్గొన‌బోతున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ఇత‌ర కేటాయింపుల విష‌య‌మై ఏపీ నుంచి వ్య‌క్త‌మౌతున్న ఒత్తిడి నేప‌థ్యంలో కేంద్రం ఈ స‌మావేశం ఏర్పాటు చేస్తోంది. అయితే, దీనిలో ఏపీ నుంచి వెళ్ల‌బోతున్న అధికారులు ప్ర‌ధానంగా ప్ర‌స్థావించాల్సిన‌ స‌మ‌స్య‌ల‌పై బుధ‌వారం జ‌రిగే క్యాబినెట్ భేటీలో నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇక‌, టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీ విష‌యానికొస్తే… మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ స‌మావేశంలో ప్ర‌త్యేక హోదాకు సంబంధించిన అంశాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడారు. 2017 త‌రువాత ప్ర‌త్యేక హోదా అనేదే ఉండ‌ద‌నీ, దానికి బ‌దులుగా ప్ర‌త్యేక సాయం కింద ప్యాకేజీ ఇస్తామ‌ని నాడు కేంద్రం చెప్పింద‌ని చంద్రబాబు అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం మాట‌ల్ని పూర్తిగా విశ్వ‌సించి ప్ర‌త్యేక సాయానికి అంగీక‌రించామ‌న్నారు. ఇంత‌వ‌ర‌కూ ప్ర‌త్యేక సాయానికి సంబంధించిన నిధుల‌ను కేంద్రం పూర్తిగా విడుద‌ల చేయ‌లేద‌న్నారు. బ‌డ్జెట్ లో ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా పొంది ఉన్న రాష్ట్రాల‌కు దాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంద‌ని గుర్తుచేశారు. ఒక‌వేళ ఇత‌ర రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే వెసులుబాటు ఉన్న‌ట్ట‌యితే, హోదా హ‌క్కుగా ఉన్న మ‌నం కూడా ఇదే విష‌య‌మై కేంద్రాన్ని అడ‌గాల్సిన అవస‌రం ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. బుధ‌వారం జ‌ర‌గ‌బోయే క్యాబినెట్ భేటీలో ఈ అంశంపై కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పేరేదైతేనేం ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం ముఖ్యం అన్న‌ట్టుగా చంద్ర‌బాబు ధోర‌ణి ఉంది. కానీ, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అంశం మ‌రోసారి అటు కాంగ్రెస్‌, ఇటు వైకాపాలు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. దాని కోసం పోరాటం అంటూ ఎవ‌రి మార్గంలో వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీన్ని మ‌రోసారి ఏపీలో సెంటిమెంట్ అంశంగా మార్చి, రాజ‌కీయ ప్ర‌యోజ‌నం రాబ‌ట్టుకునే దిశ‌గా ఇత‌ర పార్టీలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా గురించి చంద్రబాబు ఇలా మాట్లాడ‌టం కాస్త ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే, హోదా అనేది ముగిసిన అధ్యాయం అని కేంద్రం ఎప్పుడో తేల్చేసింది. అయితే, హోదాకు త‌త్స‌మాన ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని చెప్పి, ఇప్పుడు వాటిపై కూడా కేంద్రం నుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో టీడీపీ కూడా మ‌రోసారి హోదా సాధ్యాసాధ్యాల‌పై, దానికి సమానంగా రావాల్సిన ప్రయోజనాలపైనా మరోసారి చ‌ర్చించే దిశ‌గా ప‌డిన తొలి అడుగులా ఇది క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.