స్వ‌తంత్ర స‌మ‌రస్ఫూర్తితో కేంద్రంపై పోరాటం..!

కేంద్రంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు కురిపించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. స్వ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా శ్రీ‌కాకుళంలో ఆయ‌న జాతీయ ప‌తాకాన్ని ఎగ‌రేసి, అనంత‌రం ప్ర‌సంగించారు. ఆంధ్రా హ‌క్కుల కోసం పోరాడ‌తామ‌నీ, స్వ‌తంత్ర స్ఫూర్తితో సాధించుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. నాడు స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధులు రాజీప‌డి ఉంటే దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చేది కాద‌న్నారు. అదే స్ఫూర్తితో ఈరోజున రాజీప‌డేదే లేద‌నీ, హ‌క్కుల సాధ‌న కోసం నిరంత‌రం పోరాటం చేస్తామ‌ని సీఎం అన్నారు.

ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని పార్ల‌మెంటులో అప్ప‌టి ప్ర‌ధాని చెప్పార‌నీ, కానీ భాజ‌పా స‌ర్కారు కుంటిసాకులు చూపుతూ వ‌చ్చింద‌న్నారు. ఇస్తామంటూ ఊరిస్తూ కాలయాపన చేశారన్నారు. తిరుప‌తికి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ, వెంక‌న్న సాక్షిగా హోదా ఇస్తామ‌న్నారు. ఆ త‌రువాత‌, మాట త‌ప్పార‌న్నారు. ఇది చాలా బాధాక‌ర‌మైన ప‌రిస్థితి అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును 2019కి పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కానీ, రాష్ట్రం పెట్టిన ఖ‌ర్చులే ఇంకా తిరిగి ఇవ్వ‌లేద‌న్నారు. రెవెన్యూ లోటు భ‌ర్తీ విష‌యంలో మాట మార్చార‌నీ, రాష్ట్రంలో రైతు రుణ‌మాఫీలు చేశామ‌నీ పేద‌ల‌కు పింఛెన్లు ఇచ్చార‌నీ, కాబ‌ట్టి కేంద్ర నిధులు ఇవ్వ‌డం లేద‌ని అడ్డుపెట్టార‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి రూ. 1500 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌నీ, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కీ ఇత‌ర న‌గ‌రాల‌కీ భారీ ఎత్తున నిధులిచ్చార‌ని విమ‌ర్శించారు. వెన‌క‌బ‌డిన జిల్లాల ప్యాకేజీ విష‌యంలోనూ మాట‌త‌ప్పార‌న్నారు. రాష్ట్ర అకౌంట్లో వేసిన సొమ్మును కూడా వెన‌క్కు లాక్కునే తీరుగా కేంద్రం వైఖ‌రి ఉంటోంద‌ని విమ‌ర్శించారు. క‌డ‌ప‌లో అన్నీ ఇస్తామ‌ని చెబుతున్నా, అన్ని ర‌కాలు వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని నివేదిక‌లు చెప్పినా.. ఉక్కు క‌ర్మాగారంపై ఏదో ఒక సాకు చూపి అడ్డుపెట్టార‌న్నారు.

పెట్రోలు ధ‌ర‌ల్ని నియంత్రించే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్నారు. బ్యాంకుల విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తినే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. పేద‌ల‌పై అనూహ్యంగా భారం పెరుగుతోంద‌ని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రంపై విమ‌ర్శ‌ల‌తోపాటు… రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌ముఖ ప‌థ‌కాల గురించి, గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం సాధించిన అవార్డుల గురించి ముఖ్య‌మంత్రి చెప్పారు. కేంద్రం తీరును ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు సీఎం మ‌రోసారి ప్ర‌య‌త్నించార‌ని చెప్పొచ్చు. కేంద్రం నుంచి ఏమాత్రం సాయం అంద‌క‌పోయినా… రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌శ‌క్తితో ఎదుగుతోంద‌నీ, ఈ క్ర‌మంలో తమ శ్ర‌మ‌ను మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేట్టుగా చెప్పే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశారని అనొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.