ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఐదుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు , విభజన హామీలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వే జోన్, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ పర్యటనలో అన్నింటికంటే ముఖ్యమైనది కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరగబోయే భేటీ. ఈ సమావేశం కేవలం నిధులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన కీలక మార్పులపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కీలక రాజకీయ పరిణామాలు , పాలనాపరమైన సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ ద్వారా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదల , బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే జల్ శక్తి, రైల్వే, వ్యవసాయ శాఖా మంత్రులతో జరిపే చర్చలు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించనున్నాయి. పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం తిరిగి అమరావతికి చేరుకుంటారు.
