క‌మ‌ల్ కు చంద్ర‌బాబు ఇచ్చిన స‌ల‌హా..!

రామేశ్వ‌రం నుంచి త‌న యాత్ర‌ను క‌మ‌ల్ హాస‌న్ ప్రారంభించారు. అక్క‌డి నుంచి ఆయ‌న మ‌దురై చేరుకుని, బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అక్కడ పార్టీ ఏర్పాటు ప్రకటన ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతోపాటు ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖుల నుంచి వీడియో సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపే అవ‌కాశం ఉంది. అయితే, క‌మ‌ల్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు హీరో అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి తనకో సలహా ఇచ్చారని చెప్పారు.

గ‌త రాత్రి త‌న‌కు చంద్ర‌బాబు ఫోన్ చేశార‌ని క‌మ‌ల్ చెప్పారు. ‘రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నామ‌నే భ‌య‌ప‌డాల్సిన అవస‌రం లేద‌నీ, మంచి చేయ‌డానికే మీరు వ‌స్తున్నారు క‌దా’ అని చంద్ర‌బాబు త‌న‌కు చెప్పార‌ని క‌మ‌ల్ అన్నారు. ‘కొత్తగా పార్టీ పెడుతున్న మీరు ముందుగా సిద్ధాంతాల గురించి ప్రస్తుతం ఎక్కువగా ఆలోచించాల్సిన ప‌నిలేద‌నీ, ముందుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లేంటో తెలుసుకోవాల‌నీ, వాటిని ఒక జాబితాగా తయారు చేసుకుని ముందుకు వెళ్తుంటే చాలు’ అని త‌న‌కు స‌ల‌హా ఇచ్చార‌న్నారు. త‌న రాజ‌కీయ వైఖ‌రి ఏంట‌ని చాలామంది అడుగుతున్నార‌నీ, ఈ విష‌య‌మై త‌న‌కు కొంత ఆందోళ‌న ఉండేద‌నీ, ఇదే విష‌యం చంద్ర‌బాబు ముందు ప్ర‌స్థావిస్తే.. ఆయ‌న త‌న‌కు స‌రైన స‌ల‌హా ఇచ్చార‌ని క‌మ‌ల్ చెప్పారు. రాజ‌కీయాల్లో చంద్రబాబు విజ‌న్ అద్భుతం అని క‌మ‌ల్ మెచ్చుకున్నారు. తన దృష్టిలో సినిమాల‌కీ రాజ‌కీయాల‌కూ పెద్ద‌గా తేడా లేద‌నీ, ఈ రెండు ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికే ఉన్నాయ‌నీ, అయితే రాజ‌కీయాల్లో మ‌రింత బాధ్య‌త ఉంటుంద‌ని క‌మ‌ల్ అన్నారు.

నిజానికి, చంద్ర‌బాబు నాయుడు గురించి త‌మిళ‌నాడులో చాలామంది ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. దానికి కార‌ణం చంద్ర‌బాబు హ‌యాంలో హైద‌రాబాద్ లో జ‌రిగిన ఐటీ రంగ అభివృద్ధి. హైటెక్ సిటీ నిర్మాణం, అనంత‌రం పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు హైద‌రాబాద్ కి వ‌చ్చాక‌.. ఉద్యోగాల కోసం వచ్చిన‌వారిలో త‌మిళ‌నాడు యువ‌త ఎక్కువ‌మంది ఉన్నారు. అప్ప‌ట్నుంచీ చంద్ర‌బాబు అంటే ఐటీ, ఆంధ్రా అంటే చంద్ర‌బాబు అనే ఒక‌ర‌క‌మైన అభిమానం వారిలో ఏర్ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.