తెలకపల్లి వ్యూస్: చంద్రబాబుకు కితాబులకన్నా వార్నింగులే జాస్తి

చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సిఎంఎస్‌) నిర్వహించిన సర్వే గురించి ఎపి సమాచార శాఖ ఒక నోట్‌ విడుదల చేసింది. ఈనాడు మీడియా వారినే ఉటంకిస్తూ ఆ నోట్‌కు ప్రచారమిచ్చారు. చంద్రబాబు పనితీరు పట్ల చాలా సంతృప్తిగా వున్నారనీ, ఆయనకు మరో ప్రత్నామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తమైందని ఆ నోట్‌ పేర్కొన్నది.

అంత పెద్ద సంస్థ స్వయంగా విశ్లేషించే బదులు ప్రభుత్వ నోట్‌ను ఆధారంగా చేసుకోవడం ఆశ్చర్యమే. బాబుకు ప్రత్యామ్నాయం లేదు అని సర్వే చెబుతున్నట్టు ఆంధ్రజ్యోతి శీర్షికనిచ్చింది. మొత్తంపైన బాగా అనుకూలంగా వున్నట్టు చిత్రించే ప్రయత్నమే జరిగింది. ఇదంతా నిజమేనా..తెలుసుకోవడానికి నేను సిఎంఎస్‌ అధినేత డా.భాస్కరరావుగారిని సంప్రదించాను. వాస్తవానికి తాము రెండేళ్ల కిందట విభజనానంతర ఎన్నికల సమయంలో చంద్రబాబు పాత్ర గురించి మాత్రమే తాము అడిగాము తప్ప ప్రస్తుత కాలానికి సంబంధించి కాదని సిఎంఎస్‌ చైర్మన్‌ డా.భాస్కరరావు వివరణ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే తమ సర్వే విభజన నుంచి ఇప్పటి వరకూ గడచిన పరిస్థితులకు సంబంధించింది గాని, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు.

గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజల సమాధానాలను గమనిస్తే రాజకీయ శూన్యత, మిశ్రమ స్పందన వున్నట్టు కూడా గమనించవచ్చన్నారు. ఆసలు వారు విడుదల చేసిన సర్వే సారాంశానికి ‘ప్రజలను ఉత్సాహపరచలేకపోతున్న బాబు సర్కార్‌ పథకాలు’ అని హెడింగ్‌ పెట్టారు. రుణమాపీ వంటి పథకాలపై కొంత సంతృప్తి వున్నా ఆయన కలిగించిన అంచనాలతో పోల్చినప్పుడు బాగా వెనకబడి వుండటం ఇబ్బంది కలిగించవచ్చుని అందులో విశ్లేషించారు. ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్తి అవుతాయని మెజార్టి ప్రజలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా ఆ మేరకు ఆశలున్నాయని మాత్రమే చెప్పారు.

అవినీతి విషయంలో ఇతర మంత్రివర్గాలకూ దీనికి పెద్ద తేడాలేదనే భావనే బలంగా వుంది. మంత్రుల పని బాగాలేదని కూడ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. యువతలో అసంతృప్తి ఎక్కువగా వుండటం మరింత తీవ్రమైన విషయంగా సిఎంఎస్‌ భావించింది. మళ్లీ విభజన ఉద్యమాలు రావచ్చని 38 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చడం చిన్న సంఖ్యేమీ కాదు.

ఈ రెండేళ్లలోనూ తెలుగుదేశం రాజకీయంగా అదనంగా సాధించిందేమీ లేదని సగానికి పైగా అంచనా వేశారు. 2014తో పోలిస్తే తెలుగుదేశంకు ఓటు వేయాలనుకునేవారి సంఖ్య జిల్లాలను బట్టి ఎంతో కొంత తగ్గినట్టే కనిపిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం అంత భారీఎత్తున హడావుడి చేయనవసరం లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో అధిక సంఖ్యాకులు చెప్పారు.

ఆనాటి పరిస్థితుల్లో చంద్రబాబే మంచి ముఖ్యమంత్రి అని 63 శాతం మంది చెప్పగా ఇప్పుడు మాత్రం అంచనా దాదాపు నిట్టనిలువునా చీలివున్నాయి. మొత్తంపైన 51 శాతం అనుకూలంగానూ 49 శాతం వ్యతిరేకంగానూ వున్నట్టు , 30 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది ప్రతికూలంగా వున్నట్టు ఈ సర్వే తేల్చింది. మరిన్ని వివరాలు ఇంకోసారి పరిశీలించవచ్చు. కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా పారాహుషార్‌ అనకతప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com