బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. గురువారం ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసే అవకాశం ఉందని బీహార్ రాజకీయవర్గాలు గట్టి నిర్ణయానికి వచ్చాయి. అదే జరిగితే బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై తొలిసారిగా బీజేపీ అభ్యర్థి కూర్చునే మార్గం సుగమం అవుతుంది.
గత కొన్నాళ్లుగా పాట్నా వీడటానికి నితీష్ కుమార్ విముఖత చూపినప్పటికీ, ఇటీవల ఆయన 75వ వసంతంలోకి అడుగుపెట్టడం ఒక కీలక మలుపుగా మారింది. ఆయన ఆరోగ్యంపై తరచూ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీంతో వయస్సు రీత్యా ఆయనను జాతీయ రాజకీయాల్లోకి పంపించి, రాష్ట్ర పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తన వారసుడిగా కుమారుడు నిషాంత్ కుమార్ను రాజకీయాల్లోకి తీసుకురావడంపై కూడా జేడీయూలో చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ నితీష్ కుమార్ రాజ్యసభకు వెళితే, బీహార్లో ఎన్డీయే కూటమి తరపున కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు నితీష్ పట్టుదల కారణంగా బీజేపీకి సీఎం పదవి దక్కలేదు, కానీ తాజా పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
