జగన్‌ని ముంచడానికి చెవిరెడ్డిలాంటి వాళ్ళు చాలు

వైకాపా అధ్యక్షుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపికి డిపాజిట్లు కూడా రాలేదు. సాధారణంగా అనుభవమున్న ఇతర ఏ పార్టీ నాయకులైనా ఆ ప్రజాభిమానాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వెళతారు. కానీ వైకాపా రాజకీయం మాత్రం రివర్స్‌లో నడిచింది. అది కూడా ఆ గెలుపు వార్తలు వినిపిస్తున్న క్షణాల నుంచే వైకాపా నాయకులు ఆవేశపడిపోయారు. ఆ గెలుపును సెలబ్రేట్చే సుకోవడం కోసం వైకాపా నాయకుడు రెహ్మాన్ తన గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అసలే ఫ్యాక్షనిస్ట్ ముద్ర ఉన్న జగన్ పార్టీలో ఈ కాల్పుల వ్యవహారం కలకలం రేపింది. ఇక వైకాపా గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా బిహార్‌లా తయారవుతుంది అని టిడిపి భజన మీడియా ఓ స్థాయిలో వార్తలు వండేసింది. ఆ దెబ్బ వైకాపా పైన గట్టిగానే పడింది.

అయినప్పటికీ వైకాపా నాయకులు నేర్చుకున్న పాఠాలు మాత్రం ఏమీ లేవని తాజాగా వైకాపా నేతచెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆవేశం తెలియచేస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబే అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నాడు. 2004లో తనను ఓడించింది ప్రజలు కాదు…అధికారులు అన్నది చంద్రబాబుకు ఉన్న గట్టి భ్రమ.అందుకే అధికారులను ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తూ ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాడు. అవినీతి విషయంలో కూడా చూసీ చూడనట్టుగా పోతున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో దూసుకుపోతోందని సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలి? అధికారుల పనితీరు విషయంలో తేడా వస్తే శిక్షిస్తాం అని నాయకులు అంటే ప్రజలు మెచ్చుకునే అవకాశం ఉంది. కానీ చెవిరెడ్డి మాత్రం వైకాపా కార్యకర్తల విషయంలో తేడాగా ఉన్న అధికారులను అధికారంలోకి వచ్చిన వెంటనే అండమాన్‌కి పంపిస్తారట. రెండో చెంప చూపించడానికి నేనేమీ గాంధీని కాదు అని కూడా ఆయనగారు హీరోయిజం చూపిస్తున్నారు. ఇలాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ నిజజీవితంలో మాత్రం గాంధీవి కాకపోతే గాడ్సేవా? అన్న ప్రశ్న వెంటనే ఎధురవుతుంది? ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తించేలా ఉంటుంది. ఆ తర్వాత 2014 ఫలితం రిపీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.