తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే సైనికుడికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నిరూపిస్తూ, ఉత్తరాంధ్ర యువనేత చింతకాయల విజయ్ పేరు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విజయ్, ఇప్పుడు పెద్దల సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి అయ్యన్నపాత్రుడికి తగ్గ తనయుడిగా, పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన పసుపు సైనికుడిగా ఆయన సాగించిన పోరాటానికి గుర్తింపు లభిస్తోంది.
కష్టకాలంలో వెనకడుగు వేయని పోరాటం
వైసీపీ ఐదేళ్ల హయాంలో చింతకాయల విజయ్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు, పోలీసు వేధింపులు, రాజకీయ దాడులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. పార్టీ గళాన్ని సోషల్ మీడియాలో మరియు క్షేత్రస్థాయిలో బలంగా వినిపించినందుకు ఆయన అనేక వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, బెదరకుండా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చడంలో ఆయన చూపిన చొరవ చంద్రబాబు , లోకేష్‌లను ఆకట్టుకుంది.
మూడుసార్లు నిరాశ.. అయినా చెక్కుచెదరని విశ్వాసం
గతంలో మూడు సార్లు రాజకీయ సమీకరణాల కారణంగా విజయ్‌కు అవకాశాలు చేజారాయి. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీట్ల సర్దుబాటు , సామాజిక సమీకరణాల వల్ల త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, ఆయన ఏనాడూ అసంతృప్తి చెందకుండా పార్టీ నిర్ణయానికే కట్టుబడ్డారు. ఆ ఓర్పు, క్రమశిక్షణే ఇప్పుడు ఆయనకు అదృష్టంగా మారాయి. లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, పార్టీ ఐటీ విభాగం బలోపేతంలో ఆయన చూపిన నైపుణ్యం విజయ్‌కు రాజ్యసభ బెర్త్ ఖాయం కావడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
బలమైన బీసీ గళం
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని టీడీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గ మద్దతు ఉండటం, ప్రస్తుతం బీసీ కోటాలో గట్టి పోటీ లేకపోవడం విజయ్‌కు సానుకూలాంశాలుగా మారాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒక సమర్థవంతమైన, ఉన్నత విద్యావంతుడైన యువనేతను ఢిల్లీకి పంపడం ద్వారా అటు సామాజిక వర్గానికి, ఇటు ప్రాంతానికి న్యాయం చేసినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది. చింతకాయల విజయ్ కేవలం ఒక వారసుడిగా కాకుండా, స్వయంకృషితో ఎదిగిన నాయకుడిగా పార్టీ కేడర్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హేమాహేమీలు ఉన్న హస్తినలో పార్టీ తరపున వాణిని బలంగా వినిపించగల రాజకీయ చాతుర్యం ఆయన సొంతం. త్వరలోనే రాజ్యసభ స్థానానికి అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది.



