ఎంవోయుల హడావుడితోనే పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చినట్టు కాదు

రవి తెలకపల్లి:

విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు బ్రహ్మాండంగా విజయవంతమైంది. విభజిత రాష్ట్రమైన నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఇది శుభసూచకమే. ఈ సదస్సులో 4.78 లక్షల కోట్ల మేరకు 331 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వీటివల్ల పదిలక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రిలయన్స్‌ అనిల్‌ అంబానీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా అందరూ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం కూడా సంతోషమే. అనిల్‌ అంబానీ గతంలో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఏకంగా మహాత్మాగాంధీతోనే పోల్చిన దృష్ట్యా ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. వెంకయ్య నాయుడు తమ పార్టీ పెరుగుదల కన్నా చంద్రబాబును పొగడ్డంలో ఎక్కువగా మునిగితేలుతున్నారని మొన్ననే ఒక బిజెపి నేత నాతో అన్నారు. అది కూడా ఆశ్చర్యం కాదు. ఈ ప్రశంసలు పరవశాలు పక్కన పెడితే- ఇంతమంది పారిశ్రామిక దిగ్గజాలు రావడం, చర్చించడం ఆహ్వానించదగిన పరిణామం.

అయితే ఇలాటి సమ్మేళనాల్లో ప్రస్తావనకు వచ్చిన ప్రాథమిక అవగాహన కుదిరిన ఒప్పందాలపై ఎక్కువగా ఆశపెట్టుకోవడం మాత్రం అవాస్తవికమవుతుంది. 2013లో మోడీ హయాంలో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో కుదిరిన ఎంవోయులలో 8 శాతం మాత్రమే అమలుకు వచ్చినట్టు లెక్కలున్నాయి. మొత్తంగా ఆయన పాలించిన కాలమంతటిలోనూ 15శాతానికి మించి ఒప్పందాలు అమలు కాలేదు. అనిల్‌ అంబానీ ప్రతిపాదనలు కూడా వాటిలో వున్నాయి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఇలాటి అనుభవాలే వున్నాయి. కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో పరిస్థితి అంతా అస్థిరంగా వున్నప్పుడు కూడా ఒక్కరోజులో రెండు లక్షల కోట్ల ఎంవోయులపై సంతకాలు జరిగాయని మోత మోగించారు. నిజంగా వచ్చినవెన్ని? ఉద్యోగాలిచ్చిందెక్కడ? వైఎస్‌ హయాంలోని ఫ్యాబ్‌సిటీ, లేపాక్షి, హబ్‌ బ్రాహ్మణి వంటివన్నీ ఎక్కడకు పోయాయి? అంతకుముందు చంద్రబాబు పాలనలో ఇచ్చిన భూముల్లోనూ ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి? గోల్ఫ్‌ కోర్సు, ఎంఆర్‌ఎంజిఎప్‌ వంటివి చివరకు ఎలా పరిణమించాయి?

అమరావతిలో అన్ని అద్భుతమైన అవకాశాలున్నాయని చెబుతుంటే ఈ ఒప్పందాలలో రాజధాని అభివృద్ధి పథకాలకు ముందుకు వచ్చిన వారెవరు? గతాన్ని వదలిపెట్టి ఈ 18 నెలల పాలనలో అనుభవాలు చూసినా అట్టే ఫలితాలు కనిపించవు. అసలు మెమోరాండం అప్‌ అండర్‌స్టాండింగ్‌(ఎంవోయు) అనేది ఒప్పందం కానేకాదు. ప్రాథమికంగా అనుకునే మాట మాత్రమే. ఒప్పందానికి ఎంవోయుకు తేడా ఏమిటో నెట్‌లో ఎక్కడ చూసినా తెలుస్తుంది. ఇంతకంటే గట్టిగా కుదిరిన ఒప్పందాలే అమలుకు నోచుకోనివి చాలా వున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో పశ్చిమబెంగాల్‌లో లక్ష రూపాయల నానో కారుకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి కొంత దూరం వెళ్లిన తర్వాత కూడా గుజరాత్‌కు తరలించుకుపోయిన అనుభవం ఉంది. కనుక ఇరుపక్షాలలో ఎవరినీ నిబద్దులను చేయని ఎంవోయులను అతిగా ప్రచారం చేసి పెట్టుబడుల వరద అనీ, ఉద్యోగాల వెల్లువ అని ప్రచారం చేసుకోవడం వాస్తవికత అనిపించుకోదు. అవన్నీ నిజం కావాలని ఆశించవచ్చు గాని అయిపోయినట్టు అధికారికంగా చెప్పడం వల్ల అమాయక యువత ఆశాభంగానికి గురవుతారని గుర్తుంచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com