కేంద్రం తీరుపై చంద్ర‌బాబు మ‌నోగ‌తం ఇదే..!

మోడీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన చివ‌రి కేంద్ర బ‌డ్జెట్ ఆంధ్రాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్రాకు ఆశించిన కేటాయింపులు, విభ‌జ‌న చ‌ట్ట‌ప్ర‌కారం ద‌క్కాల్సిన నిధులూ ఏవీ రాలేదు. దీంతో ప్ర‌జ‌ల నుంచి కొంత అస‌హ‌నం వ్య‌క్త‌మౌతోంది. ఇక‌, అధికార పార్టీలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆంధ్రాకు ఇంత అన్యాయం జ‌రుగుతుంటే ఇంకా పొత్తు కొన‌సాగించ‌డంలో అర్థం లేదంటూ టీడీపీ ఎంపీలు కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఓ ద‌శ‌లో.. రాజీనామాలు చేసేద్దామ‌నే ప్ర‌తిపాద‌న‌తో ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు. ఆ త‌రువాత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంపీల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీలంద‌రూ కేంద్రం తీరుపై చాలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ‘తొంద‌ర‌ప‌డొద్దు’ అంటూ కొంత శాంతింప‌జేశారు. ఇవాళ్ల ఏపీ క్యాబినెట్ భేటీ ఉంది. దీన్లో బ‌డ్జెట్ అంశాలే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రాబోతున్నాయి. దీంతోపాటు, ఆదివారం నాడు ఎంపీల‌తోపాటు విస్తృత స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఓవ‌రాల్ గా టీడీపీలో కొంత వాడీవేడీ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌నోగ‌తం ఏంట‌నేది ప్ర‌శ్న‌..? నిజానికి, కేంద్రం తీరుపై గ‌డ‌చిన కొన్ని రోజులుగా సీఎం అసంతృప్తిగానే ఉన్నారు. ఏపీ భాజ‌పా నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా… ‘మిత్ర‌ధ‌ర్మం అడ్డొస్తోంది కాబ‌ట్టి నేను స్పందించ‌లేక‌పోతున్నాను’ అని వ్యాఖ్యానించిన సంద‌ర్భాలున్నాయి. అయితే, ఇప్పుడీ బ‌డ్జెట్ విష‌య‌మై వీసీలో ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే… ‘ఇంకొన్నాళ్లు ఆగుదాం’ అని చంద్ర‌బాబు చెప్పారు. ‘ఇంకా స‌మ‌యం ఉంది. పార్ల‌మెంటులో మీరు నిర‌స‌న తెలియ‌జేయండి. బ‌డ్జెట్ ఆమోదించేలోగా చేయాల్సిన ప్ర‌యత్నాల‌న్నీ చేద్దాం. అప్ప‌టికీ కేంద్రం తీరు మార‌పోతే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుందాం’ అన్న‌ట్టుగా సంకేతాలు ఇచ్చారు.

అనంత‌రం, మంత్రుల‌తో జ‌రిగిన భేటీలో కూడా చంద్ర‌బాబు ఇదే ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకు అన్యాయం జరిగిందని ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల అభిప్రాయ‌ప‌డ్డారు. అమ‌రావ‌తికి నిధులివ్వ‌లేద‌నీ, పోల‌వ‌రం ప్ర‌స్థావ‌న లేద‌నీ… ఏ ర‌కంగా చూసుకున్నా రాష్ట్రానికి భాజ‌పా అన్యాయం చేసింద‌నే అభిప్రాయాన్ని ముఖ్య‌మంత్రి ముందు కొంత‌మంది మంత్రులు వ్య‌క్తం చేశారు. అయితే, ఈ అంశాల‌పై మ‌రింత విస్తృతంగా పార్టీలో చ‌ర్చించుకోవాల‌నీ, అంత‌వ‌ర‌కూ తొంద‌ర‌ప‌డొద్ద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం.

మొత్తానికి, ఇంకొన్నాళ్లు వేచి చూద్దామ‌నే ధోర‌ణిలో ముఖ్య‌మంత్రికి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ‌ధాని నిధులు, ప్ర‌త్యేక ప్యాకేజీ… ఇలాంటివ‌న్నీ కేంద్రం నుంచి రావాల్సిన‌వే. అన్నిటిక‌న్నా ముఖ్యంగా, నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు అంశం కూడా కేంద్రం ద‌గ్గ‌ర ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌కీయంగా ఆర్థికంగా ఎలా ఆలోచించినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుకు కేంద్రం అవ‌స‌రం చాలా ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ ద‌శ‌లో భాజ‌పాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం అనేది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఇబ్బంది క‌లిగించే రాజ‌కీయ నిర్ణ‌యంగా మారుతుందేమో అనేది చంద్ర‌బాబు అభిప్రాయంగా క‌నిపిస్తోంది. మ‌రి, రాబోయే రెండ్రోజుల్లో జ‌ర‌గ‌నున్న కీల‌క భేటీల్లో అంతిమ నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా, ఆంధ్రా విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రి చాలా దారుణం. రాష్ట్ర అవ‌స‌రాలు, రాజ‌కీయ అవ‌స‌రాల దృష్ట్యా అధికార పార్టీ ఏదైనా ఆలోచించుకోవ‌చ్చు! కానీ, సామాన్యుల్లో మాత్రం… భాజపా తీరుపై చాలా ఆగ్ర‌హం వ్య‌క్త‌మౌతోంది. ఇది టీడీపీ అర్థం చేసుకోవాల్సిన అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.