మూసిప్రక్షాళన ఓ శివదీక్ష అని.. దాన్ని అడ్డుకుంటే ప్రజలే శివతాండవం చేస్తారని రేవంత్ విపక్షాలను హెచ్చరించారు. మూసి ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాలను 8 ఎకరాల్లో 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కేవలం ఒక నిర్మాణ కార్యక్రమం కాదని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న చారిత్రక సందర్భమని అభివర్ణించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.. మూసీ నది పునరుజ్జీవనం చేసే అదృష్టం తమ ప్రభుత్వానికి దక్కడం పూర్వజన్మ సుకృతమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేవుడే వాటిని తొలగిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి అడ్డుకోవాలని చూడటం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో పదవులు అనుభవించిన వారే ఇప్పుడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేసును వెంటనే వెనక్కి తీసుకోండి, లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజికంగా బహిష్కరిస్తారని హెచ్చరించారు. మానవ తప్పిదాల వల్ల కలుషితమైన మూసీని ప్రక్షాళన చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదని, నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములని సీఎం మండిపడ్డారు.
హైదరాబాద్ నగరాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రక శివాలయంతో పాటు మత సామరస్యానికి చిహ్నంగా ఒక మసీదును, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ గా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇది ఓట్ల కోసం లేదా నోట్ల కోసం చేస్తున్న పని కాదని, రాబోయే తరాలకు గొప్ప చరిత్రను అందించాలన్న చిత్తశుద్ధితో చేస్తున్న శివదీక్ష అని రేవంత్ చెప్పుకొచ్చారు.


