తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, పరిపాలనలో తనదైన ముద్ర వేయకముందే వివాదాల్లో చిక్కుకున్నారు. తన వ్యక్తిగత జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన ప్రత్యేక అధికారి గా నియమించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా విజయ్ రాజకీయ సమావేశాల్లో ఈ జ్యోతిష్కుడి ప్రమేయంపై వస్తున్న రూమర్లకు ఈ నియామకం బలాన్ని చేకూర్చింది. ప్రజల సమస్యల కంటే గ్రహగతులకే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు తమిళ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD పొలిటికల్ పదవి అనేది అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రభుత్వ ఫైళ్లు, విధానపరమైన నిర్ణయాలు, ఉన్నతాధికారుల బదిలీలు వంటివన్నీ ఈ అధికారి కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఒక అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిని లేదా పాలనా దక్షుడిని నియమించాల్సింది పోయి, కేవలం జ్యోతిష్యుడిని కూర్చోబెట్టడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనివల్ల మొత్తం సీఎంవో సదరు వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోయిందని, ప్రభుత్వ నిర్ణయాల్లో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కంటే జాతక చక్రాలకే పెద్దపీట వేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ గురించి ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరైనా కీలక నేతలు ఆయనతో మాట్లాడటానికి వెళ్తే, విజయ్ మౌనంగా వింటారని, పక్కనే ఉండే జ్యోతిష్కుడే అన్నింటికీ బదులిస్తారని సమాచారం. ఇప్పుడు అదే వ్యక్తి నేరుగా ప్రభుత్వ వ్యవస్థలోకి రావడం విజయ్ ఇమేజ్ను దెబ్బతీసే అంశమని భావిస్తున్నారు. హేతువాదం, ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యమంత్రి ఇలా మూఢనమ్మకాలకు , వ్యక్తిగత సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడం మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
