విశ్లేష‌ణ : కామెడీ హీరోల‌ ట్రాజ‌డీ

క‌మెడియ‌న్లు ముదిరితే హీరోల‌వ్వ‌డం కామ‌న్‌. రాజ‌బాబు నుంచి రాజేంద్ర ప్ర‌సాద్ వర‌కూ, సునీల్ నుంచి స‌ప్త‌గిరి వ‌ర‌కూ ఎంత‌మంది క‌మెడియ‌న్లు హీరోల‌య్యారో లెక్కేలేదు. ఆఖ‌రికి బాబూ మోహ‌న్, సంపూర్ణేష్ బాబులు కూడా హీరోయిజం చేస్తే… చూసి త‌రించాం. కమెడియ‌న్ల హీరోయిజానికి కాసులు కురిసిన రోజులున్నాయి. య‌మలీల వ‌సూళ్లు చూసి అప్ప‌టి చిత్ర‌సీమ ఆశ్చ‌ర్య‌పోయింది. కేవ‌లం ఆ ఒక్క హిట్లుతో అలీ.. నిర్విరామంగా 50 సినిమాలు చేశాడంటే.. న‌మ్మ‌గ‌ల‌రా?? రాజేంద్ర ప్ర‌సాద్ కెరీర్ గురించి చెప్పేదేముంది? కామెడీ హీరోగా త‌న‌ది తిరుగులేని స్థానం. స్టార్ హీరోల సినిమాలు ఎన్నొచ్చినా – వాళ్లెన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టినా – కొత్త కొత్త హీరోల్ని ఎంత‌మందిని చూసినా ఓ క‌మెడియ‌న్ హీరో గా వ‌స్తున్నాడంటే ఆ సినిమాపై ఆస‌క్తి పెర‌గ‌డం ఖాయం. వాళ్ల‌కంటూ ఓ మార్కెట్ ఉంది. వాళ్ల కంటూ అభిమాన‌గ‌ణం ఉంది. వాళ్ల‌తో సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లూ రెడీనే. అయితే ఇదంతా గ‌తం. ఒక‌ప్పుడు క‌ళ‌క‌ళ‌లాడిపోయిన కామెడీ హీరోయిజం.. ఈ రోజు ట్రాజెడీ గా మారింది. క‌మెడియ‌న్ల హీరోయిజం చూడ‌లేం బాబూ… అంటూ ప్రేక్ష‌కులు క‌ళ్లు మూసుకుంటున్నారు. ఆయా సినిమాల ప‌రాజ‌యం త‌ట్టుకోలేక‌… నిర్మాత‌లు బావురుమంటున్నారు.

అల్ల‌రి న‌రేష్ నుంచి మొద‌లెడ‌దాం. ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ హీరోత‌ను. ఆరేడు కోట్ల‌లో సినిమా తీస్తే.. ప‌ది కోట్లు తెచ్చుకున్న సంద‌ర్భాలు కోకొల్ల‌లు. సినిమా యావ‌రేజ్‌గా ఉన్నా పెట్టుబ‌డి మొత్తం తిరిగొచ్చేసేది. త‌న సినిమాల‌కు శాటిలైట్ కూడా మంచి రేటు ప‌లికేది. ఒక‌ప్పుడు నాలుగైదు సినిమాల‌తో క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ముగించేవాడు. కానీ ఇప్పుడు న‌రేష్ ఓ ఫ్లాప్ హీరో. తెర‌పై ఎన్ని ట్రిక్కులు చేసినా కాసులు రాల‌డం లేదు. హిట్టు కొట్టి ఏళ్ల‌కు ఏళ్లు అయిపోయింది. అచ్చంగా సునీల్ ప‌రిస్థితీ అంతే. క‌మెడియ‌న్‌గా స్టార్ హోదా అనుభ‌వించాడు సునీల్‌. హీరోగా తొలి అడ‌గుల్లో హిట్ల మీద హిట్లు కొట్టాడు. కానీ రాను రాను సునీల్ కామెడీ కూడా బోర్ కొట్టేసింది. ఆ త‌ర‌వాత ప‌రాజ‌యాల ప‌రంప‌ర మొద‌లైపోయింది. వ‌రుస‌గా అర‌డ‌జ‌ను ఫ్లాపుల‌తో బోరు కొట్టించేశాడు. గీతాంజ‌లి త‌ర‌వాత కామెడీ హీరోగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడు శ్రీ‌నివాస‌రెడ్డి. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురాతో ఓ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్నాడు. రూపాయి పెడితే పావ‌లా కూడా తిరిగిరాని ప‌రిస్థితి దాపురించింది. ఇప్ప‌టికీ త‌న చేతిలో సినిమాలున్నాయి. కాక‌పోతే నిర్మాత‌ల‌కే ఇదివ‌ర‌క‌టిలా ధైర్యం లేదు. స‌ప్తగిరి ప‌రిస్థితీ ఇంతే. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌, స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బీ అంటూ.. రెండు ప్ర‌య‌త్నాలు చేశాడు. అవి బెడ‌సి కొట్టేశాయి. సంపూర్ణేష్ బాబు క్రేజ్ తొలి సినిమాకే ప‌రిమిత‌మైపోయింది. త‌న సినిమా సిద్ధంగా ఉన్నా – విడుద‌ల చేయ‌డానికి బ‌య్య‌ర్లు రెడీగా లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ధ‌న్‌రాజ్‌, తాగుబోతు ర‌మేష్‌, కృష్ణ‌భ‌గ‌వాన్ వీళ్లంతా హీరోయిజం వెల‌గ‌బెట్టిన వాళ్లే. కానీ… ఫ‌లితం శూన్యం. ఇక మీద‌ట క‌మిడియ‌న్‌ని హీరోగా చేయాలంటే నిర్మాత‌లు ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకోవాల్సిందే.

సినిమా త‌ప్ప మ‌రో వినోద సాధ‌నం లేని రోజుల్లో…. థియేట‌ర్‌కి వెళ్ల‌డం మిన‌హా మ‌రో ఆప్ష‌న్ ఉండేది కాదు. అప్ప‌ట్లో పెద్ద హీరోలు కామెడీ చేసేవాళ్లు కాదు. న‌వ్వుకొనే మార్గం కామెడీ హీరోల సినిమాల్లోనే ద‌క్కేది. పైగా రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి హీరోల‌తో బ‌డా ద‌ర్శ‌కులు సినిమాలు చేసేవారు. ఆయా సినిమాల్లో క‌థ‌, క‌థ‌నాల్లో నాణ్య‌త క‌నిపించేది. జంథ్యాల కామెడీ ఎప్పుడూ ఎవ‌ర్ గ్రీనే. ఇప్పుడు అలాంటి ద‌ర్శ‌కుడు లేదు. ఇవీవీ – ఎస్ వీ కృష్ణారెడ్డి కామెడీ చిత్రాలు కూడా ఓ ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు ఆ శైలి లేదు. కామెడీ హీరో కేవ‌లం కామెడీకే ప‌రిమితం కావ‌డం లేదు. యాక్ష‌న్ చేస్తున్నాడు, క‌మ‌ర్షియ‌ల్ హీరోలా డాన్సులు చేద్దామ‌నుకుంటున్నాడు. ఇవ‌న్నీ స‌గ‌టు ప్రేక్ష‌కుడికి, కేవ‌లం వినోదం కోరుకునేవాడికి న‌చ్చ‌డం లేదు. ఇప్పుడు బ‌డా హీరోలు సైతం కామెడీ చేసేస్తున్నారు. న‌వ్వుకోవ‌డానికి న‌ల‌భై మార్గాలు దొరికేశాయి. న‌వ్విస్తాడ‌నుకున్న క‌మెడియ‌న్ మాత్రం అది తప్ప అన్నీ ఇస్తున్నాడు. అందుకే.. కామెడీ హీరో కెరీర్ మొత్తం ట్రాజ‌డీగా మారిపోయింది.
తాజాగా 2 కంట్రీస్‌, స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బీ ప‌రాజ‌యాలు.. కామెడీ హీరోల‌కు క‌నువిప్పు కావాలి. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డం లేదు? అనే విష‌యంపై లోతుగా ఆలోచించాలి. నిజాయ‌తీగా త‌మ త‌ప్పుల్ని ఒప్పుకోగ‌ల‌గాలి. అవి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. లేదంటే.. మ‌రో క‌మెడియ‌న్ హీరో అవ్వ‌డం క‌ష్టం. అయినా ఆ సినిమా ఆడ‌డం ఇంకా క‌ష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.