అత్తారింటికి దారేదితో పోలికేంటి??

గీత గోవిందంలోని స‌న్నివేశాలు విడుద‌ల‌కు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసే విష‌య‌మే. ఏ నిర్మాత‌కీ ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌కూడ‌దు. అల్లు అర‌వింద్ లాంటి నిర్మాత‌లైతే.. వేగంగా స్పందించి, న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోగ‌లిగారు. మ‌రొక‌రైతే ప‌రిస్థితేంటి? అయితే… ఈ ఈ ఎపిసోడ్‌ని అత్తారింటికి దారేది లీకేజీతో పోల్చ‌డ‌మే చాలా ఆశ్చ‌ర్యంగానూ, ఇంకాస్త అనుమానంగానూ అనిపిస్తోంది. స‌ద‌రు ఈ ఘ‌ట‌న‌ని అత్తారింటికి దారేది లీకేజీతో పోల్చి చూడ‌డం ఈ స‌మ‌స్య‌ని మ‌రింత భూత‌ద్దంలో చూపించ‌డ‌మే అవుతుంది. ఎందుకంటే.. అత్తారింటికి దారేదిలో స‌గం సినిమా విడుద‌ల‌కు ముందే లీకైపోయింది. అది కూడా పూర్తి క్వాలిటీతో. గీతా గోవిందం అలా కాదు. అక్క‌డ‌క్క‌డ కొన్ని స‌న్నివేశాలు.. అది కూడా ర‌ఫ్ వెర్ష‌న్‌. లీకేజీ లీకేజీనే. న‌ష్టం న‌ష్ట‌మే. ఈ లీకేజీ వ‌ల్ల గీత గోవిందం న‌ష్ట‌పోయిన మాట వాస్త‌వం. కానీ.. మ‌రీ అత్తారింటికి దారేదితో పోల్చి చూసేంత‌గా ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా ఇదంతా ఇంటి దొంగ‌ల చేతి ప‌ని. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల క‌క్కుర్తి వ‌ల్ల సినిమాలోని సన్నివేశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే… అవి చూసి `ఇది చాల్లే.. సినిమా చూడ‌క్క‌ర్లెద్దు` అనుకునేంతగా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే… అల్లు అర‌వింద్ లాంటి నిర్మాత `సినిమాలు మానేద్దామ‌నుకుంటున్నా` అనేంత డిప్రెష‌న్‌కి లోన‌య్యేంత సీరియెస్ లేదు. దీనికే ఇలా అయిపోతే.. అత్తారింటికి దారేది నిర్మాత నిజంగా ఆ స‌మ‌యంలో ఏమైపోవాలి? విడుద‌ల త‌ర‌వాత‌..సినిమా బ‌య‌ట‌కు వ‌స్తే దాన్ని పైర‌సీ అనాలి. ముందే.. ఇలా లీకైతే.. క‌చ్చితంగా ఇది స్వ‌యంకృతాప‌ర‌ధ‌మే. దాన్నుంచి బ‌య‌ట‌కు ఎలా రావాలి? అనేది ద‌ర్శ‌క నిర్మాత‌లు గ‌ట్టిగా ఆలోచించుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com