హెచ్చు తగ్గుల “చంద్ర” కళలు

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడికి బలమే బలహీనతగా మారిపోగా చంద్రశేఖరరావు బలహీనతనే బలంగా మార్చుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ ప్రభావం దాదాపు లేదు. ప్రధానిని కూడా ఎంపిక చేసిన పలుకుబడి చంద్రబాబుది. డిల్లీలో కెసిఆర్, జగన్ లు ఒకనాడు నివశించిన బంగళాల కేటాయింపు వారికి సునాయాసంగా జరిగిపోగా తనకు ఏ బంగళా ఎప్పుడు కేటాయిస్తారోనని సుదీర్ఘకాలం పడిగాపులు పడిన అవస్ధ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది.

పౌర్ణమి తరువాత మసకబారే కృష్ణపక్షం చంద్రుడిలా చంద్రబాబు నాయుడు, అమావాస్య తరువాత వెన్నెల పరచే శుక్లపక్షం చంద్రుడిలా చంద్రశేఖరరావు కనిపిస్తున్నారు.

ఉద్యమ,పోరాటాల ద్వారా ప్రజల ముందుకి వచ్చిన కెసిఆర్ మాటల్లో ఆత్మవిశ్వాసం ధీమాలతో పాటు తృణీకార ధ్వనులు కూడా వినిపిస్తాయి. చంద్రబాబులో గాంభీర్యము, కొంత ఒదిగి వుండే ధోరణి కనిపిస్తాయి.

నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నట్టున్న బిజెపి సంబంధాలు చిర్రెత్తిస్తున్నా, ఆత్మగౌరవం దెబ్బతింటున్నా స్పందించలేని నిస్సహాయతో, ఓర్పో చంద్రబాబుది.

కేంద్రం నుంచి ఎపి కి ఎంత వచ్చినా, ఎంతో కొంత తెలంగాణాకు కూడా వస్తుందన్న ధీమా కెసిఆర్ ది. అసలు ఈయన పరిపాలిస్తున్నాడా, ఫామ్ హౌస్ లో పుస్తకాలతో కాలక్షేపంచేస్తున్నాడా అనిపించేటంత దూరంగా వుండే కెసిఆర్ ప్రజల ముందుకి రావలసిన ఏసందర్భాన్నీ వొదిలిపెట్టరు. ఎంతసేపు మాట్లాడినా విసుగురానివ్వరు. వికేంద్రీకరణను అమలు చేస్తున్నారు. అయినా కెసిఆర్ మంత్రులెవరూ మీడియా ముందుకి రారు. వచ్చినా అతిక్లుప్తంగా చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోతారు.

చంద్రబాబు ప్రతీవిషయంలోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో మరణాల మొదలు, కాల్ మనీ నేరాలు, ఇసుక మాఫియాలు, ఒకటేమిటి సబ్ డివిజనల్ స్ధాయి విషయం నుంచీ, మంత్రి స్ధాయి వరకూ తనదృష్టిలో పడిన ప్రతీ విషయంలోనూ సంబంధిత విభాగాల ద్వారా ఆదేశాలు జారీ చేయించకుండా స్వయంగా ఆయనే ”ఎంతవారినైనా వదిలేది లేదు” అని ప్రకటనలు చేసేసి కోతిపుండుని బ్రహ్మరాక్షసి గా మార్చేస్తూంటారు. కాల్ మనీ కేసుని రాష్ట్రమంతటా పులిమేసి గ్రామాల్లో అప్పుపుట్టనివ్వని పరిస్ధితి తెచ్చారు. ఇందులో మహిళల గౌరవాన్ని భంగపరచిన వారు ఏమైపోయారో తెలియదు.

ముఖ్యమంత్రిగారు ఉపన్యాసం మొదలు పెడితే గంట దాటిపోతోందని అధికారులు, పార్టీపెద్దలు తమలోతాము విసుక్కుంటున్నారు. ఆయనతో సమానంగా ఆయన మంత్రులు కూడా మైకాసురులే! పైగా వారిలో ఇద్దరు ముగ్గురు నోరు తెరిస్తేనే వివాదాలైపోతాయి. ఈపరిస్ధితి కెసిఆర్ కు లేదు.

కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ రాజకీయ ఉన్నతికి అవకాశాలు ఇస్తారు. అయితే కొన్ని విషయాల్లో కొడుకుని కూడా దగ్గరకు రానీయరని పేరుంది. ఆవిధంగా రాజకీయ వారసుడికి ఒక వైపు అవకాశం ఇచ్చి మరో వైపు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆదుపు చేసే దూరదృష్టి ఆయనది. కెటిఆర్ కు మంత్రి పదవి ఇవ్వడంద్వారా ఆయన్ని ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యుడిని చేసిన ట్రెయినింగ్ కెసిఆర్ ది.

కెటిఆర్ మాదిరిగా ఉద్యమాల్లో గాని ప్రజాజీవనంలోగాని అనుభవంలేని చిన్నవాడు లోకేష్ ను చంద్రబాబు పార్టీకి సర్వసేనానిగా చేసేశారు. పెద్దపెద్ద నాయకులు కూడా లోకేష్ చుట్టూ తిరగవలసిన పరిస్ధితి వచ్చింది. అధికారులతో కూడా చినబాబు నేరుగా మాట్లాడుతున్నారు.

ఇది నాయకుడిగా కాక రాజ్యాంగేతర శక్తిగా చినబాబు ఎదిగే ప్రమాదకరమైన పరిణామం..ఏదైనా తేడా వస్తే పార్టీ పెద్దలంతా మాకు సంబంధం లేదని మాయమైపోయే సంకేతం.

దాయాది రాష్ట్రాలు కావడం, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సాంఘిక ఆర్ధిక సాంస్కృతిక సంబంధాలు పటిష్టంగా వుండటం వల్ల ప్రతి సందర్భంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోలికలను తేడాలను ప్రజలు గమనిస్తూనే వుంటారు.

కేంద్రం నుంచి విభజన సహాయం ఎలాగూలేదు. హైదరాబాద్ లో వుంటున్న ఆంధ్రుల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా రావడంలేదు. గత నాలుగు నెలల్లో తెలంగాణాలో 1లక్షా 50 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఖరారు కాగా అందులో 1లక్షా25 వేల కోట్ల రూపాయల పనులు
ఉద్యమకాలంలో ఆతరువాతా కెసిఆర్ తిట్టిపోసిన “ఆంధ్రోళ్ళే” దక్కించుకున్నరని చెబుతున్నారు.

వడ్డించిన విస్తరి లాంటి హైదరాబాద్ ముందు కూర్చున్న కేసిఆర్ కి వున్న సౌఖ్యం సహాయం కోసం డిల్లీ పెట్టుబడుల కోసం దేశదేశాలూ తిరుగుతున్న చంద్రబాబుకి లేదు. ఇదొక్కటే ఆయనకు సానుభూతి మిగిల్చే విషయం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]