రేవంత్ పదవికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టే..!

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రేవంత్ రెడ్డి ఈ మ‌ధ్య కొంత అస‌ంతృప్తిగా ఉంటున్నార‌నే క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానం ద‌క్క‌డం లేద‌న్న అసంతృప్తి ఆయనలో కొంత ఉన్నమాట వాస్త‌వ‌మే. దీంతోపాటు, త‌న అనుచ‌రుల‌కు కూడా పార్టీలో ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌నీ, త‌న నుంచి వారిని దూరం చేసే కుట్ర ఏదో జ‌రుగుతోంద‌న్న అభిప్రాయంతో రేవంత్ ఉన్నారంటూ గుస‌గుస‌లు వినిపించాయి. అందుకే, కొన్నాళ్ల‌పాటు మౌనంగా ఉండాల‌ని రేవంత్ నిర్ణ‌యించుకున్నార‌నీ, ఓసారి హైక‌మాండ్ ను క‌లుసుకోవాల‌నే ఉద్దేశంతో ఉన్నారన్నారు. కొన్నాళ్ల‌పాటు సొంత నియోజ‌క వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం కావాల‌నీ అనుకున్నారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలో సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటు చేస్తున్న జోష్ లో కాంగ్రెస్ హైక‌మాండ్ ఉంది. ఆ వెంట‌నే, తెలంగాణ‌పై పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌ట్నుంచే పార్టీ వ‌ర్గాలను స‌మ‌న్వ‌య ప‌ర‌చేందుకు అనువుగా రాష్ట్ర స్థాయి నాయ‌క‌త్వంలో కొత్త‌గా ఇవ్వాల్సిన బాధ్య‌త‌లు, చేయాల్సిన మార్పుల‌పై రాహుల్ దృష్టి సారిస్తున్నార‌ట‌. దీన్లో భాగంగా ముందుగా రేవంత్ రెడ్డి ప‌ద‌వి అంశ‌మై రాహుల్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చేరిక స‌మ‌యంలో ఇచ్చిన హామీ ప్ర‌కార‌మే రేవంత్ కి పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ ప‌దవి దాదాపు ఖ‌రారు అన్న‌ట్టుగా టీ కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇక‌, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్న కుంతియాను మార్చే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ కూడా వినిపిస్తోంది. తెలంగాణ విష‌యంలో ఆయ‌న చురుకైన పాత్ర పోషించ‌డం లేద‌న్న అభిప్రాయం పార్టీ హైక‌మాండ్ కు క‌లిగింద‌నీ, కాబ‌ట్టి మార్పు త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఆయ‌న స్థానంలో గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా ప‌నిచేసిన గులామ్ న‌బీ ఆజాద్ కి తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇక‌, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌ద‌వి విష‌యంలో ఎలాంటి మార్పులూ ఉండే అవ‌కాశం లేద‌న్న‌ది స్ప‌ష్టంగానే ఉంది. ఏదేమైనా, ముందుగా రేవంత్ రెడ్డికి స్ప‌ష్ట‌మైన బాధ్య‌త‌లు, ప‌ద‌వీ ఖరారు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే, రేవంత్ ఫైర్ బ్రాండ్ నేత‌. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న బ‌స్సుయాత్ర‌ల్లో స‌భ‌లు చూసుకుంటే… రేవంత్ ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. సో.. ప‌ద‌విపై మ‌రింత స్ప‌ష్ట‌త రాగానే రేవంత్ యాక్టివ్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్టుగా చెప్పుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com