కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం… ఏం ఉప‌యోగం..?

ఇప్ప‌టికే టీడీపీ, వైకాపాలు పెట్టిన రెండు అవిశ్వాస తీర్మానాలు ప్ర‌తీరోజూ లోక్ స‌భ‌లో దోబూచులాడుతున్నాయి. గ‌డ‌చిన ఆరు రోజులుగా ఒకే సీన్‌. స‌భ ఆర్డ‌ర్ లేదు, స‌భ్యుల‌ను లెక్కించ‌లేక‌పోతున్నా, అవిశ్వాసంపై చ‌ర్చ పెట్టలేం… స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇవే మాట‌లు చెప్పేసి, వాయిదా మీద వాయిదాలు వేస్తున్నారు. ఆరో రోజు కూడా ఇవే కార‌ణాల‌ను చూపుతూ మంగ‌ళ‌వారం వ‌ర‌కూ స‌భ‌ను వాయిదా వేశారు. అయితే, ఉన్న ఈ రెండు అవిశ్వాస తీర్మానాలు చాల‌వ‌న్న‌ట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంపై అవిశ్వాసం పెట్ట‌బోతోంది. ఆ పార్టీ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఇప్ప‌టికే స్పీక‌ర్ కి నోటీసులు ఇచ్చారు.

కాంగ్రెస్ అజెండా ఏంటంటే… ఏపీ స‌మ‌స్య‌ల‌తోపాటు నీర‌వ్ మోడీ దేశాన్ని విడిచి వెళ్ల‌డం, దేశంలోని ద‌ళితుల‌పై దాడులు, మోడీ పాల‌న‌లో ఎవ్వ‌రికీ భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్న కార‌ణాల‌ను ప్ర‌ధానంగా చూపుతూ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. అయితే, టీడీపీ వైకాపాల క‌న్నా కాంగ్రెస్ పార్టీ స‌భ్యుల సంఖ్య ఎక్కువ కాబ‌ట్టి, వారు పెట్టే తీర్మాన‌మైనా చ‌ర్చ‌కు వ‌స్తుందా అనే అభిప్రాయాలు కొంత‌మంది వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, ఎవ‌రు ఏం చేసినా స్పందించే ప‌రిస్థితి లోక్ స‌భ‌లో క‌నిపించ‌డం లేదు. ఏపీ ఎంపీలు ప్ర‌వేశపెడుతున్న తీర్మానానికి ఎంత‌మంది స‌భ్యులు మ‌ద్ద‌తు ఇస్తున్నారో లెక్కించ‌లేక‌పోతున్నా అని స్పీక‌ర్ చెబుతున్నారు క‌దా! ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవిశ్వాసం అంటే… మ‌ద్ద‌తుగా నిల‌బ‌డేవారి సంఖ్య పెరుగుతుంది. అయినాస‌రే, లెక్కించ‌లేక‌పోతున్నా సభ్యులు కనిపించడం లేదూ అని స్పీక‌ర్ చెబితే ఎవ్వ‌రూ ఏం చెయ్య‌లేర‌నుకోండి..!

ఎన్నాళ్లీ ప‌రిస్థితి..? రోజూ నోటీసులు ఇవ్వ‌డం, స‌భ వాయిదా ప‌డ‌టం.. ఇది ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుంద‌నే ప్ర‌శ్న‌కీ స‌మాధానం క‌నిపిస్తోంది. రాజ్య‌స‌భ‌కి కొత్త‌గా ఎన్నికై స‌భ్యులు వ‌స్తున్నారు. పాత స‌భ్యుల‌కు సెండాఫ్ కార్య‌క్ర‌మం ఉంది. కాబ‌ట్టి, ఈ నెల 28 త‌రువాత స‌భ‌ను నివధికంగా వాయిదా వేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. భాజ‌పా కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే… భాజ‌పా విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల్సిందే. పంతం నెగ్గించుకున్నామ‌ని భాజ‌పా నేత‌లు అనుకోవ‌చ్చుగానీ… ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కొనే సామ‌ర్థ్యం భాజ‌పాకి లేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లు కాంగ్రెస్ తో స‌హా అన్ని పార్టీలూ పెద్ద ఎత్తున చేసే అవ‌కాశం. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పెడుతున్న అవిశ్వాస తీర్మానం ఆ ర‌కంగా ఆ పార్టీకి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం మాత్ర‌మే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.