10 మందితో కాంగ్రెస్ రెండో జాబితా..! దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ .. మరో పది స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి.. దాసోజు శ్రవణ్‌కుమార్‌కు.. ఖైరతాబాద్ టిక్కెట్‌ను ప్రకటించారు. దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లిహిల్స్‌ను ఖరారు చేశారు. మేడ్చల్ నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు ఖరారయింది. ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, ధర్మపురి నుంచి లక్ష్మణ్ కుమార్, సిరిసిల్ల నుంచి కెకె మహేందర్ రెడ్డి, షాద్‌నగర్ నుంచి ప్రతాప్ రెడ్డి, భూపాల్‌పల్లి నుంచి గండ్ర వెంకట రమణా రెడ్డి, పాలేరు నుంచి కండల ఉపేందర్ రెడ్డిలకు టిక్కెట్లు ప్రకటించారు.

తొలి జాబితా, రెండో జాబితా కలిపి మొత్తం 75 మంది అభ్యర్థుల జాబితా విడుదలయింది. జనగామ టిక్కెట్ పై పొన్నాల లక్ష్మయ్య, సనత్ నగర్ టిక్కెట్ పై.. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. అయినా వీరికి రెండో జాబితాలోనూ చోటు దక్కలేదు. గ్రేటర్‌లో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తెలుగుదేశం పార్టీ అడుగుతోందన్న ప్రచారం జరిగింది. అయినప్పటికీ.. ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అలాగే… ఎల్లారెడ్డి స్థానం టీజేఎస్‌కు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. టీడీపీకి ఇంకా.. నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాలన్నీ గ్రేటర్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే… సనత్ నగర్, ఎల్పీనగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల కోసం.. టీడీపీ గట్టిగా పట్టుబడుతోంది. కాంగ్రెస్ వీటికి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. వీటిలో .. కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. అందుకే చర్చలు తెగడం లేదని.. మహాకూటమి వర్గాలు చెబుతున్నాయి.

మిత్రపక్షాలకు పోనూ.. కాంగ్రెస్ పార్టీ 95 స్ధానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇంకా పందొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో.. ఖైరతాబాద్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయించడమే.. కాస్త ఆసక్తిరమైన ఎంపిక. గతంలో పిఆర్పీలో చురుకుగా పని చేసిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. మంచి వాగ్ధాటి ఉన్న ఆయనను టీఆర్ఎస్ అధినేత బాగానే ఉపయోగించుకున్నారు కానీ.. టిక్కెట్ దగ్గరకు వచ్చేసరికి.. సామాజికవర్గ బలం లేదని… చెప్పి.. నిరాకరించారు. దాంతో ఆయన గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ దృష్టిలో కూడా పడ్డారు. ఇప్పుడు కీలకమైన స్థానంలో టిక్కెట్ కూడా దక్కించుకోగలిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com