భారత రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ప్రత్యర్థులకు బలమైన నాయకులను సరఫరా చేసే ఒక రాజకీయ శిక్షణ కేంద్రం గా మారిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేడు చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రులు , కీలక నేతల గతాన్ని పరిశీలిస్తే, వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ గూటిలో ఎదిగిన వారే . కాంగ్రెస్ ఈరోజు తన ప్రత్యర్థులకు ఒక ప్రధాన రాజకీయ శత్రువు కంటే, వారిని తీర్చిదిద్దే ఒక నర్సరీలా కనిపిస్తోంది.
ఈశాన్యంలో కాంగ్రెస్‌ను తుడిచేసిన మాజీ కాంగ్రెస్ నేత హిమంత
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నుంచి బెంగాల్ రాజకీయాల్లో కీలక నేత సువేందు అధికారి వరకు.. వీరంతా కాంగ్రెస్ , దాని అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారే. హిమంత బిస్వా శర్మ ఒకప్పుడు అస్సాం కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉండి, అనంతరం బీజేపీలో చేరి ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరణకు మూలస్తంభంగా మారారు. అలాగే, బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొంటున్న సువేందు అధికారి కుటుంబం కూడా కాంగ్రెస్ వాదులే. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కూడా కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టి అధికారాన్ని దక్కించుకున్నారు.
విజయ్ కూడా గతంలో యూత్ కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం
తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తలైవా విజయ్ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా ఉంది. 2009లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినట్లు, అప్పట్లో రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ అప్పుడే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఉంటే, నేడు తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ, చివరకు ఆయన సొంత పార్టీ టీవీకే పెట్టి నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కేరళలో కూడా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న నేతలే ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తున్నారు.
నాయకులను తయారు చేసి బీజేపీకి ఇస్తున్న కాంగ్రెస్
ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేయడంలో, వారికి రాజకీయ ఓనమాలు నేర్పడంలో అగ్రస్థానంలో ఉంది కానీ, వారిని పార్టీలో నిలుపుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. పార్టీని వీడిన నేతలు బయటకెళ్లి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడం లేదా ప్రత్యర్థి పార్టీలను అధికారంలోకి తీసుకురావడం కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ప్రత్యర్థిని బలహీనపరచడం కంటే, తన శిక్షణలో పెరిగిన నేతలే తనకు ప్రత్యర్థులుగా మారడం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఇది కచ్చితంగా పార్టీని నడిపించే వారి వైఫల్యం. .


