మోడీకి విజ‌య సాయి పాదాభివంద‌నం నిజ‌మేనా..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి పాదాభివంద‌నం చేశారంటూ టీడీపీ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఓప‌క్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతూ.. మ‌రోప‌క్క ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాదాల‌కు న‌మ‌స్క‌రించ‌డంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇదే అంశ‌మై టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌, వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిలు స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు చేసుకున్నారు. ఎంపీ విజ‌య‌సాయి రాజ్య‌స‌భ‌లో ఆంధ్రుల‌ను అగౌర‌వ ప‌రిచార‌ని సీఎం రమేష్ అన్నారు. స‌భ‌లోకి ప్ర‌ధాన‌మంత్రి వ‌స్తుంటే, విజ‌య‌సాయి ఎదురెళ్లి ప్ర‌ధాని కాళ్ల‌కు న‌మ‌స్క‌రిస్తే, ఆయ‌న భుజాల‌ను ప‌ట్టుకుని ప్ర‌ధాని లేపి నిల‌బెట్టార‌నీ, భుజం త‌ట్టి ప‌ల‌క‌రించార‌ని సీఎం ర‌మేష్ అన్నారు. ఓప‌క్క కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆంధ్రులు ఆక్రోశంతో ఉంటే.. కేవ‌లం త‌న కేసుల నుంచి విముక్తి క‌ల్పించుకోవ‌డమ‌నే ల‌క్ష్యంతో, అంద‌రూ చూస్తుండ‌గా మోడీ కాళ్ల‌పై ప‌డ్డార‌న్నారు. ఓప‌క్క ఎంపీల రాజీనామాలు అంటూ, కేంద్రంపై అవిశ్వాసం అంటూ మాట్లాడుతూ… ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఆంధ్రుల ఆత్మగౌర‌వాన్ని మంట‌గ‌ల‌ప‌డ‌మే అని సీఎం ర‌మేష్ మండిప‌డ్డారు.

సీఎం ర‌మేష్ ఆరోప‌ణ‌ల‌పై విజ‌య‌సాయి రెడ్డి కూడా స్పందించారు. తాను సంస్కార‌వంతంగా న‌మ‌స్కారం చేస్తాన‌నీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎదురైనా న‌మ‌స్క‌రిస్తాన‌ని విజ‌య‌సాయి అన్నారు. ఇక‌, ప్ర‌ధాన‌మంత్రికి పాదాభివంద‌నం విష‌యానికొస్తే… త‌న కంటే ముందు సుజ‌నా చౌద‌రి వెళ్లి, ప్ర‌ధానికి న‌మ‌స్కారం పెట్టార‌న్నారు. త‌రువాత‌, తాను భార‌తీయ సంస్కృతి ప్ర‌కారం ప్ర‌ధానికి న‌మ‌స్కారం పెట్టాన‌నీ, ఆయ‌న ప్ర‌తి న‌మ‌స్కారం చేసి ప‌ల‌క‌రించారు అన్నారు. అంతేగానీ, వారు చేస్తున్న విమర్శల్లో చంద్ర‌బాబు అనుచ‌రులు చేస్తున్న కుట్ర‌లూ కుతంత్రాలు త‌ప్ప, వాస్త‌వాలు లేవ‌న్నారు. ప్ర‌ధానికి సంస్కార‌బ‌ద్ధంగా చేసిన న‌మ‌స్కారాన్ని కూడా పాదాభివంద‌నంగా చెబుతూ ఉండ‌టం కుసంస్కారం అన్నారు.

సీఎం ర‌మేష్ స‌వాల్ ను తాను స్వీక‌రిస్తున్నాన‌నీ, స‌భ‌లో ఏం జ‌రిగిందో ధ్రువీక‌రించిన వీడియో ఫుటేజ్ ను మీడియాకి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఆ వీడియో బ‌య‌ట‌కి వ‌స్తే అన్నీ తెలుస్తాయ‌నీ, సుజ‌నా చౌద‌రి ఎలా న‌మ‌స్కారం పెట్టారో, ప్ర‌ధానితో ఏం చ‌ర్చించారో బ‌య‌ట‌ప‌డుతుంద‌ని విజ‌య‌సాయి అన్నారు.

అయితే, పదవీ కాలం పూర్తయిన ఎంపీలు వరుసగా ప్రధానికి అభివాదం చేసి వెళ్తుంటే.. ఆ క్రమంలో సుజనా చౌదరి కూడా విష్ చేశారట. విజయసాయి రెడ్డి వంతు వచ్చేసరికి ప్రధాని వేరే వైపు తిరిగి ఉన్నారనీ, దీంతో కూర్చుని ఉన్న ఆయన చేతులు అందుకుని కరచాలనం చేశారట. వెనక నుంచి చూసేవాళ్లకు ఆయన వంగి మోడీ పాదాలను తాకుతున్నట్టుగా కనిపించినట్టుగా ఉందట. వాస్తవానికి అక్కడ జరిగింది.. కేవలం కరచాలనం మాత్రమే అంటున్నారు. మొత్తానికి, ఈ వ్యవహారం టీడీపీ, వైకాపా మధ్య రచ్చకు కారణమైంది.

[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/03/Letter-to-Rajya-Sabha-Secretary-General-seeking-unedited-video-.pdf” title=”Letter to Rajya Sabha Secretary General seeking unedited video”]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.