ప్రొ.నాగేశ్వర్ : వివేకానందరెడ్డి హత్యపై రాజకీయమా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. వైఎస్ వివేకానందరెడ్డి.. పులివెందులలోని స్వగృహంలో హత్యకు గురయ్యారు. దీనిపై… తెలుగుదేశం, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు.. వివేకాను.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డి కలిసి చంపారని అంటున్నారు. టీడీపీ నేతలు.. అనే అంశాలను ముందుకు తీసుకొచ్చి కుటుంబసభ్యులే చంపారంటున్నారు. అదే సమయంలో.. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి.

ప్రముఖుల హత్యలపై వదంతులు సహజమే..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి… టీవీల్లో, సోషల్ మీడియాల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే.. ఇది భావోద్వేగ సమయం. ఎవరైనా ప్రముఖులు చనిపోతే.. రకరకాల పుకార్లు వస్తాయి. ఇది నా చిన్న తనం నుంచి చూస్తున్నాను. అప్పట్లో సంజయ్ గాంధీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తే.. ఇందిరాగాంధీనే చంపించిందని ప్రచారం చేశారు. అప్పట్లో.. ఈ మీడియాలు.. సోషల్ మీడియాలు ఎక్కువగా లేవు. అయినప్పటికీ.. అలాంటి పుకార్లు విస్తృతంగా వస్తూ ఉండేవి. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా వదంతులు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు.. రిలయన్స్ చేయించిందని…ఓ రష్యన్ ఫేక్ వెబ్‌సైట్‌లో వచ్చిందని… రచ్చ చేశారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో వచ్చి వింటూ ఉంటాయి. పోలీసులు దర్యాప్తు చేసి.. చెప్పే వరకు.. ఈ ఘటనను ఖండించారు. వివేకానందరెడ్డి చాలా.. సౌమ్యుడు. అందరి పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడిగా… ఆయనకు కాస్త ఇమేజ్ ఉంది.

వివేకా హత్యపై ఇంత రాజకీయం ఎందుకు..?

ఇప్పటికే సోషల్ మీడియాలో దుర్మార్గంగా మాట్లాడుకోవడం జరిగింది. పైగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతీ విషయాన్ని మరింతగా రాజకీయం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఊహాగానాలు రాస్తూ ఉంటారు. “ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే…వివేకానందరెడ్డి హత్య జరిగింది..” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఎంత అన్యాయం ఇది..?. వివేకానందరెడ్డి హత్య జరిగితే.. వైసీపీ విజయానికి ఉపయోగపడుతుందని… పీకే సలహా ఇచ్చారని.. వాళ్లు పాటించారని సోషల్ మీడియాలో రాయడం దుర్మార్గం. కోడికత్తి కేసులోనూ ఇలాగే జరిగింది. సానుభూతి కోసం… జగనే చేయించుకున్నారని టీడీపీ అంటోంది. టీడీపీ వాళ్లే చేయించారని… వైసీపీ అంటోంది. ఓ పథకం ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లో.. టీడీపీ నేతలో చేయించారని నేను అనుకోను. ఎవరో ఏదో చేస్తే.. రాజకీయం చేశారని అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందనేది… విచారణలో తేలుతుంది. అందుకే.. ఇలాంటి విషయాల పట్ల .. ఊహాగానాలు సరికాదు. దీనిపై టీడీపీ, వైసీపీ నాయకత్వం సంయమనం పాటించాలి.

పోలీసులను తమ పని తాము చేయనివ్వాలి..!

వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై.. రెండు రాజకీయ పార్టీలు విమర్శలు ఆపకపోతే.. వివేకా కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం తగ్గిపోతుంది. రెండు పార్టీలకు సోషల్ మీడియా బృందాలు ఉన్నాయి. ఎవరికి వారు.. సొంత కథలు అల్లి.. ప్రచారంలోకి తెస్తారు. అందుకే.. వివేకానందరెడ్డి మృతిపై.. పోలీసులు తమ దర్యాప్తును.. తాము కొనసాగించేలా చేయగలగాలి. నిష్పాక్షికంగా… విచారణ జరగాలి. అసలు ఏం జరిగిందనేది… పారదర్శకంగా ఉండేలా చూడాలి. వివేకా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇది రాజకీయం చేసే అంశం కాదు. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం.. రాయలసీమ కరువు వంటి వాటిపై రాజకీయాలు చేయాలి. కానీ వివేకా మృతి మీద కాదు. ఇప్పటికైనా.. వివేకా హత్య విషయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.