మూడు సీట్ల‌పై క్లారిటీ వ‌చ్చినా సీపీఐలో అసంతృప్తి..!

ఎడ‌తెగ‌డ‌ని డైలీ సీరియ‌ల్ మాదిరిగా కొన‌సాగుతూనే ఉంది మ‌హా కూట‌మి సీట్ల పంప‌కాల వ్య‌వ‌హారం. వాస్త‌వానికి, ఒక్కో మిత్ర‌ప‌క్షానికీ కాంగ్రెస్ ఇచ్చే సీట్లు కొన్నే అయినా… చివ‌రి వ‌ర‌కూ బేరాలు కొన‌సాగిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో సీపీఐకి మూడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల విష‌య‌మై కాంగ్రెస్ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంప‌ల్లి, ఖ‌మ్మం జిల్లాలో వైరా, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజ‌క వ‌ర్గాల‌ను ఆ పార్టీకి కాంగ్రెస్ ప్ర‌తిపాదించింది. ఈ మూడు స్థానాల్లో అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను కూడా పూర్తి చేసుకోవ‌చ్చ‌ని కూడా సీపీఐకి కాంగ్రెస్ స్ప‌ష్టత ఇచ్చింది. వీటితోపాటు మ‌రో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖ‌త వ్య‌క్తం చేసింది. అయితే, ఈ కేటాయింపుల‌పై సీపీఐ కొంత అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

సీపీఐకి కొత్త‌గూడెం నియోజ‌క వ‌ర్గంపై మొద‌ట్నుంచీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అయితే, ఇప్పుడా నియోజ‌క వ‌ర్గం కాంగ్రెస్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పేసింది. ఎందుకంటే, ఆ నియోజ‌క వ‌ర్గంలో సీపీఐ బ‌రిలోకి దిగితే, ప్ర‌త్య‌ర్థిగా ఉన్న తెరాస అభ్య‌ర్థి విజ‌యావ‌కాశాలు మ‌రింత సులువు అవుతాయ‌నేది కాంగ్రెస్ నేత‌ల విశ్లేష‌ణ‌. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ సీపీఐ ఏమంత ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌నీ, ఈసారి అక్క‌డ సీపీఐ పోటీ వ‌ద్ద‌ని కాంగ్రెస్ స్ప‌ష్టంగా చెబుతోంది. నిజానికి, సీపీఐ డిమాండ్ ఏంటంటే… అసెంబ్లీ స్థానాలు నాలుగు ఇవ్వాల‌నీ, కావాలంటే ఎమ్మెల్సీ ఒక‌టి త‌గ్గినా ఫ‌ర్వాలేద‌నేది వారి ప‌ట్టుద‌ల‌. ఆ నాలుగో సీటు కూడా ఖ‌మ్మం జిల్లాల్లోనే కావాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. కానీ, ఆ జిల్లాలో వైరా త‌ప్ప వేరే చోట అవ‌కాశం ఇచ్చేదే లేద‌ని కాంగ్రెస్ అంటోంది.

కాంగ్రెస్ వైఖ‌రిపై చాడా వెంక‌ట‌రెడ్డి స్పందిస్తూ… ఆ పార్టీకి కొంత ప‌ట్టువిడుపు ధోర‌ణి ఉండాల‌ని ఆయ‌న సూచించారు. కాంగ్రెస్ ఎప్పుడు ఏం చెబుతోందో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌తిపాదించిన సీట్ల‌పై త‌మ పార్టీలో చ‌ర్చించాల‌నీ, ఆ త‌రువాత త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఎమ్మెల్సీ ఒక‌టి త‌గ్గినా ఫ‌ర్వాలేదుగానీ, కొత్త‌గూడెం త‌మ‌కు కావాల‌న్న‌దే సీపీఐ ప్ర‌ధాన‌మైన డిమాండ్ కాబోతోంది. మొత్తానికి, సీపీఐతో ఇంకా సీట్ల స‌ర్దుబాటుపై స్ప‌ష్ట‌త రాలేద‌నే చెప్పాలి. ఇంకోటి… న‌ల్గొండ జిల్లాలో త‌మ‌కు ప్రాతినిధ్యం లేకుండా చేశార‌నీ, త‌మ‌కు ప‌ట్టున్న ఖ‌మ్మంలో ఒక సీటుకే ప‌రిమితం చేస్తున్నార‌ని సీపీఐ అంటోంది. మ‌రి, ఈ విష‌యంలో కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com