ఆ నిర్ణ‌యం వెన‌క కేజ్రీవాల్ వ్యూహం ఇదేనా..!

ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స‌మ‌క్షంలోనే త‌న‌పై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ సీఎస్ అన్షు ప్ర‌కాష్ చేసిన ఫిర్యాదు సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇద్ద‌రు ఆప్ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే, ఈ వివాదంలో కేజ్రీవాల్ స‌ర్కారు ఇరుక్కుందేమో అనే అభిప్రాయ‌మే క‌లిగింది. ఎందుకంటే, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌ని అధికారుల‌ను ఉపేక్షిస్తామా అని కొంద‌రు ఆప్ ఎమ్మెల్యేలు అన‌డం, అమిత్ షాపై కేసు ఉన్నా ఇంత హ‌డావుడి చేయ‌రుగానీ, ఏవో రెండు దెబ్బ‌లు ప‌డేసరికి పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేయ‌డం… ఈ నేప‌థ్యంలో ప‌రోక్షంగా ఈ దాడిని వారే అంగీక‌రించిన ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, దీన్ని కూడా నెమ్మ‌దిగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం కేజ్రీవాల్ స‌ర్కారు చేస్తోంది. ఈ దిశ‌గా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు ఆప్ స‌ర్కారు సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం..!

ఇక‌పై, ఉన్నాధికారుల‌తో జ‌రిగే స‌మావేశాల‌న్నీ ప్ర‌త్యేక్ష ప్ర‌సారం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఆప్ స‌ర్కారు ఉంద‌ట‌. ఇలా చేస్తే ప్ర‌భుత్వ అంత‌ర్గత వ్య‌వ‌హ‌రాల్లో పార‌ద‌ర్శ‌క‌త వ‌స్తుంద‌ని కేజ్రీవాల్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆప్ స‌ర్కారుపై ప్ర‌భుత్వాధికారులు విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ్గుతుంద‌న్న‌ది సీఎం వ్యూహం అని ఢిల్లీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. అంతేకాదు, ఇక‌పై ఫైళ్ల‌న్నీ ఆన్ లైన్ లో పెట్టాల‌నీ, ఏయే అధికారులు సంత‌కాలు చేయాల్సి ఉందీ, ఎవ‌రు అభ్యంత‌రాలు పెడుతున్నారు, అవి ఏ ద‌శ‌లో ఉన్నాయ‌నేది ప్ర‌జ‌లంద‌రికీ తెలుస్తాయ‌న్న‌ది వారి వ్యూహం. ఉన్న‌తాధికారుల స‌మావేశాల‌న్నీ ఢిల్లీ ప్ర‌భుత్వ అధికారిక వెబ్ సైట్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌సారాల‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను కూడా వ‌చ్చే నెల‌లో ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ లో కేటాయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అంటే, అధికారుల ప‌నితీరు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌న్న‌ది కేజ్రీవాల్ వ్యూహం! సీఎస్ మీద దాడి ఘ‌ట‌న‌ను ఇప్ప‌టికే ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ గ‌ల్లీల్లో ప్రచారం చేసుకుంటున్నారట‌. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల ఇళ్ల‌కు వెళ్లి… ‘మీరు మాకు ఓట్లేశారు. మీ కోసం ప‌నిచేయ‌ని అధికారుల విష‌యంలో మేం క‌ఠినంగా ఉండ‌టం త‌ప్పా’ అంటూ ఆర‌కంగా ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్నంలో చేస్తున్నారు. నిజానికి, తాజా ఉదంతం నేప‌థ్యంలో ఢిల్లీ స‌ర్కారుకు అధికారుల నుంచి కొంత స‌హాయ నిరాక‌ర‌ణ ఎదురౌతోంది. ఇప్పుడీ నిర్ణ‌యం తీసుకుంటే, జ‌రిగే ప్ర‌తీ స‌మావేశం ప్ర‌జ‌లు చూస్తారు, క‌దిలే ప్ర‌తీ ఫైలూ ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తుందంటే కేజ్రీవాల్ పై ఉన్న కోపాన్ని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం వారికి ఎక్క‌డుంటుంది..? కేజ్రీవాల్ వ్యూహం ఇదే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.