పీకేపై సైబ‌ర్ నేరం కేసు పెట్ట‌బోతున్నారా..?

ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహ‌మో.. లేదా, ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే మీడియా వ్యూహామో తెలీదుగానీ… వైకాపా వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కి సంబంధించి ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి తెచ్చారు! అదేంటంటే… ప్ర‌శాంత్ కిషోర్ అలియాస్ పీకేపై కేసు పెట్టేందుకు తెలుగుదేశం యోచిస్తోంద‌ట‌! ప్ర‌తిప‌క్ష పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పీకేపై పోలీసు కేసు దాఖ‌లు చేసేందుకు కావాల్సిన వివ‌రాల సేక‌ర‌ణ‌లో టీడీపీ ఉంద‌నీ, ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా పీకేపై ఏడు కేసులు న‌మోదు అయ్యాయ‌నీ, వాటిలో ఒక‌టి సైబ‌ర్ కేసు ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు స‌మాచారం సేక‌రించే ప‌నిలో ఉన్నాయ‌ట‌. వాటిని అధ్య‌య‌నం చేసి… ఏపీలో కూడా ఆయ‌న‌పై కేసు పెట్ట‌బోతున్న‌ట్టు టీడీపీ సంకేతాలు ఇచ్చింద‌ని ఆ మీడియా క‌థ‌నం!

ఇంత‌కీ, ప్ర‌శాంత్ కిషోర్ పై ఏ నేప‌థ్యంలో కేసు పెట్టేందుకు సిద్ధ‌మౌతున్నారంటే… సోష‌ల్ మీడియాలో టీడీపీపై దుష్ఫ్ర‌చారం! పీకే టీమ్ సోష‌ల్ మీడియాలో న‌కిలీ ఖాతాలను పెద్ద సంఖ్య‌లో తెరిచింద‌నీ, వేల సంఖ్య‌లో ఉన్న ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వ్య‌తిరేక పోస్టులు పెడుతున్న‌ట్టు టీడీపీ దృష్టికి వ‌చ్చింద‌ట‌. దీనికి సంబంధించిన ఆధారాల‌న్నీ టీడీపీ సేక‌రించింద‌ట‌. ఈ నేరానికి పాల్ప‌డుతున్న పీకేపై సైబ‌ర్ చ‌ట్టం కింద కేసు పెట్టాలంటూ అమ‌రావ‌తిలో టీడీపీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ల్ల రామ‌య్య డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో పీకేపై కేసుకు సిద్ధం అన్న‌ట్టుగా ఆ మీడియాలో క‌థ‌నం వ‌చ్చేసింది.

నిజానికి, సోష‌ల్ మీడియా విష‌యంలో టీడీపీ ఈ మ‌ధ్య చాలా సీరియ‌స్ గానే ఉంటోంది. పార్టీపై వ్యంగ్యంగా ఎవ‌రు ఏ వ్యాఖ్య‌లు రాసినా స‌హించడం లేదు. ఆ మ‌ధ్య ‘పొలిటిక‌ల్ పంచ్’ విష‌యంలో ఏం జ‌రిగిందో చూశాం. ఇటీవలే బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి ఐవైఆర్ కృష్ణ‌రావును తొల‌గించిన సంద‌ర్భంలోనూ ఇదే ప్రధాన కార‌ణంగా చూపించారు. అవి వ్య‌క్త‌లకు సంబంధించి సోష‌ల్ మీడియాలు కాబ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోగ‌లిగారు అనుకోవ‌చ్చు. ఇప్పుడు పీకే టీమ్ న‌కిలీ ఖాతాలు క్రియేట్ చేసింద‌ని చ‌ర్య‌లుంటాయ‌ని సంకేతాలు ఇస్తున్నార‌ట‌! ఎన్ని ఖాతాలని గుర్తించ‌గ‌ల‌రు..? అయినా, సోష‌ల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప‌నిచేసే అకౌంట్లూ, రాసే రాత‌లూ చాలానే ఉన్నాయి. అలాగే, వైకాపాకి అనుకూలంగా ప‌నిచేసేవారు కూడా ఆ పార్టీ అభిమానులో ఇంకెవ‌రో ఉండ‌టం అనేది స‌హ‌జం. సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు క‌నిపించ‌కూడదు, వ్యంగ్య వ్యాసాంగాలు ఉండ‌కూడ‌దు అనుకుంటే ఎలా..? సోష‌ల్ మీడియాని కూడా కొన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల మాదిరిగా త‌మ చెప్పుచేత‌ల్లో ఉండాల‌ని అధికార పార్టీవారు అనుకుంటున్నారో ఏమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com