కాంగ్రెస్‌లోకి డీఎస్..! టీఆర్ఎస్‌కు షాకే..!!

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో ఇప్పటికే రహస్య మంతనాలు పూర్తి చేశారు. తనకు కాంగ్రెస్‌లో ఆత్మీయుడిగా ఉన్న గులాంనబీ ఆజాద్‌ను కొద్ది రోజుల క్రితం రహస్యంగా కలసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో గతంలో ఉన్నంత ప్రాధాన్యం దక్కుతుందని హామీ లభించడంతో.. డీఎస్ మళ్లీ పాతగూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే… అనుచరులతో కూడా మంతనాలు జరిపారు కూడా. డీఎస్ కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన విషయం టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అందుకే వెంటనే నష్టనివారణ చర్యల్లో భాగంగా..డీఎస్ పార్టీకి రాజీనామా చేయక ముందే తాము బహిష్కరించాలని భావిస్తోంది. అందుకే… నిజామాబాద్ జిల్లా నేతలందరూ.. ఎంపీ కవిత సహా… సమావేశమై.. డీఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా..డీఎస్‌పై ఏ క్షణమైనా వేటు పడే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. పీసీసీ అధ్యక్షుడుగా డీఎస్ ఉన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయినా పార్టీలో డీఎస్‌ ..వైఎస్‌తో పాటు సమానంగా పలుకుబడి కొనసాగించారు. 2014 ఎన్నికల వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత తనకు ఎమ్మెల్సీ పదవి విషయంలో హైకమాండ్ మొండి చేయి చూపించడం.. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత ఆహ్వానించడంతో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2016లో కేసీఆర్ ఆయనను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరారు. దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

డి.శ్రీనివాస్ పార్టీని వీడటం.. టీఆర్ఎస్‌కు కచ్చితంగా షాక్ లాంటిదే. ఎందుకంటే.. దానం నాగేందర్ మూడు రోజుల కిందటే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి… టీఆర్ఎస్‌లో చేరారు. ఆ సందర్భంగా… బలహీనవర్గాలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లభించడం లేదని.. ఆరోపించారు. దానికి సాక్ష్యంగా డీఎస్‌ టీఆర్ఎస్‌లో చేరడాన్ని చూపించారు. ఇప్పుడు అదే డీఎస్.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com