ఏందయ్యా…. దానయ్యా… ఇప్పుడు కాలిందా తమరికి?

రోబో2 నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది నిజం. ఆ సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు. రిలీజ్ డేట్ విషయంలో ఆ టీమ్ తర్జనభర్జనలు పడుతోంది. మిగిలిన సినిమా నిర్మాతల్లో వణుకు మొదలైంది. రోబో 2 డేట్ ఫిక్స్ అయితే తప్ప, మిగిలిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రాదు. దాంతో… వేసవికి రావాలన్న సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా మహేష్ బాబు, కొరటాల శివ సినిమా ‘భారత్ అను నేను’ నిర్మాత డి.వి.వి దానయ్య గళం విప్పారు. ఆదివారం ఆయన చేసిన వరుస ట్వీట్లు రోబో 2 విషయంలో ఆయన బాధనీ, నిరసననీ తెలియజేశాయి. తెలుగులో పెద్ద సినిమాలన్నీ వేసవి విడుదలకి కసరత్తు చేస్తున్నాయని, నిర్మాతలందరూ మాట్లాడుకుని, రిలీజ్ డేట్ విషయం లో పరస్పర అంగీకారానికి వచ్చామని, రోబో 2 మాత్రం ఈ ముందస్తు సన్నాహాలని భగ్న పరుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని… బంతిని ఆయన ఛాంబర్ వైపు తోసేశారు.
దానయ్య ఆవేదన, ఆందోళన లలో అర్ధం ఉంది. కాకపోతే ఇదివరకు ఆయన చేసిందేంటి? అల్లు అర్జున్ సినిమా ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఏప్రిల్ 27 న రిలీజ్ డేట్ ప్రకటిస్తే… కనీసం ఆ నిర్మాతలను సంప్రదించకుండా మహేష్ సినిమాని కూడా ఏప్రిల్ 27 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకే పరిశ్రమలో వుంటూ… సాటి నిర్మాత ప్లానింగ్ ని గౌరవించాల్సిన అవసరం ఆయనకు లేదా? అప్పుడు ముందస్తు ప్రణాళికలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో మరో సినిమా అడ్డు పడుతోందని ఆవేశ పడడంలో అర్ధం ఉందా? తనదాకా వస్తే తప్ప ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలీదా?
రోబో 2 ని తెలుగులో విడుదల కాకుండా చూడాలన్నది కొంత మంది నిర్మాతల ప్లాన్. అందుకోసం ‘తమిళ సినిమా’ అనే కార్డు వాడాలని చూస్తున్నారు. తెలుగు సినిమా ఉన్నతికి, భవిష్యత్ కీ అడ్డుపడితే అనువాదాలని అడ్డుకుంటాం అంటూ… సెంటిమెంట్స్ ని కెలికే పనిలో ఉన్నారు. డబ్బింగ్ సినిమాల నుంచి తెలుగు సినిమాలని కాపాడుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ ఈ సో కాల్డ్ నిర్మాతలు.. అదే సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎగబడిపోతుంటారు. అప్పుడు తెలుగు తమిళ అనే తేడా వాళ్ళకి తెలీదా? డబ్బింగ్ సినిమాల విషయంలో తెలుగు పరిశ్రమ స్టాండ్ ఏంటో స్పష్టం గా చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని స్వప్రయోజనాల కోసం ట్రంప్ కార్డు గా వాడుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. టోటల్ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే… ఈ రోబో వ్యవహారం ముడిరిపోయేలా కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుద్దో చూడాలి.
Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com